
పార్కు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద రూ. 15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసిన ఆర్‌ఆర్‌ఆర్(రెడ్యూస్–రీయూజ్–రీసైకిల్) పార్కును మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ ఎండీ షాహినాసుల్తానా హఫీజుల్లాతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలిసేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని తెలిపారు. ఇప్పటివరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం తొమ్మిది శాతం మాత్రమే రీసైకిల్ అయిందని.. ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా ఆర్‌ఆర్‌ఆర్ పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. అలాగే తడి, పొడి, ఈ–వ్యర్థాలు, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరువేరుగా సేకరించవలసిన ఆవశ్యకతను నేటి తరానికి తెలిసేలా ఎల్‌సీడీ స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా వీఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 25 వేల టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించినట్లు వివరించారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరుచేస్తూ రూ. 1 కోటి 29 లక్షల 50 వేల వ్యయంతో ప్రహరీని సైతం నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, ఐదు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో విజయవాడ నగరం ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్లలో నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) సత్యవతి, ఈఈ(పార్కులు) ఏఎస్‌ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జూబిన్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 15.50 కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్ పార్కును అభివృద్ధి
ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
Comments
Please login to add a commentAdd a comment