ఆన్‌లైన్‌లో వివాహిత పరిచయం
పెళ్లి పేరిట పిలిచి స్నేహితుడితో కలిసి లైంగికదాడి
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
గుణదల(విజయవాడ తూర్పు): భర్తకు దూరంగా ఉంటున్న వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడో ప్రబుద్దుడు. ఓ మ్యాట్రిమోనీలో సంబంధం కోసం వెతుకుతుండగా ఏర్పడిన పరిచయంతో హోటల్ గదికి పిలిచి, స్నేహితుడితో కలసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ మోసంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం రెడ్డిపేట ప్రాంతానికి చెందిన సంగోజి చిన్నారి(25)కి అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌తో వివాహమైంది.
వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ప్రవీణ్ చిన్నారిని విడిచిపెట్టాడు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న చిన్నారి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మ్యాట్రిమోనీలో సాయి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, విజయవాడ రావాల్సిందిగా కోరాడు. దీంతో గత నెల 26న చిన్నారి విజయవాడకు రాగా సాయి బెంజిసర్కిల్ వద్ద గల ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఇద్దరు కలసి అక్కడే ఉన్నారు. వివాహం గురించి మాట్లాడుకుని మరుసటి రోజు చిన్నారి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.
మరలా ఈ నెల 5న రావాల్సిందిగా సాయి కోరగా చిన్నారి విజయవాడ వచ్చింది. ఆరోజు రాత్రి 10 గంటల సమయంలో బెంజిసర్కిల్ వద్ద హోటల్‌కు తీసుకువెళ్లిన సాయి ఆ గదిలోనే మద్యం తాగుతూ చిన్నారితో మాట్లాడాడు. ఒత్తిడి చేసి, ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి సాయి బయటకు వెళ్లిపోయాడు. ఇంతలో సాయి స్నేహితుడు వచ్చి చిన్నారిని బలవంతం చేయబోయాడు. భయంతో ఆమె అరవటం మొదలు పెట్టింది. అరిస్తే ఇక్కడ జరిగిందంతా ఆమె తలిదండ్రులకు చెబుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. కొద్ది సేపటికి మద్యం మత్తులో వచ్చిన సాయి తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. తాను అక్బర్‌బాషా అలియాస్ సాయిగా చెప్పాడు.
వచ్చిన స్నేహితుడు పేరు జయసాయి అని కేవలం తమ శారీరక అవసరాల కోసమే నమ్మించానని అసలు నిజం చెప్పాడు. ఇది విని గుండె బద్దలైన చిన్నారి కన్నీరుమున్నీరుగా విలిపించింది. మద్యం మత్తులో స్నేహితులిద్దరూ మరోసారి పశువుల్లా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన చిన్నారి రెండు రోజులు మదనపడింది. జరిగిన విషయం బంధువులకు తెలియజేసింది. తనకు జరిగిన అన్యాయంపై బంధువులతో కలిసి వచ్చిన చిన్నారి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు మోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment