బందరు ఇలాకా.. మంత్రి తాలూకా..!
సాక్షి, మచిలీపట్నం: బందరు మొత్తం.. మంత్రి గారి తాలూకా అన్నవిధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తార్కాణం బందరు సర్వజన ప్రభుత్వాస్పత్రి. ‘డాక్టర్‌గారూ.. నేను బందరు ఎమ్మెల్యే గారి తాలూకా.. ఆయన మంత్రిగారు కూడా..’ అంటూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి డాక్టర్లపై వత్తిళ్లు పెంచుతున్నారు రోగుల సహాయకులుగా వచ్చే కొందరు నేతలు. అంతే కాకుండా వారు.. డాక్టర్లు చెప్పిన టెస్ట్‌లు కాకుండా ఎలాంటి పరీక్షలు రాయాలో కూడా ఆ నేతలే సూచిస్తున్నారు. మరి కొందరు సహాయకుల పేరుతో వచ్చే చోటామోటా నేతలు ఇంకాస్త ముందుకు వెళ్లి.. అవసరం లేకపోయినా అడ్మిట్ చేసుకోవాలని, వార్డులో బెడ్స్ వసతి కల్పించాలని ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వాళ్లు చెప్పినట్టే చేయాలట..
రోగులకు అవసరం మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తారు. ఇది వైద్యుల వృత్తి. దీనికి భిన్నంగా ఉంది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో. అధికార పార్టీ నాయకులు కొంతమంది.. ఎక్స్‌రేలాంటి చిన్న చిన్న టెస్టులు చాలన్న చోట ఎమ్మారై, సీటీస్కాన్ లాంటివి చేయించాలని చెబుతుండటంతో వైద్యుల్లో చర్చగా మారింది. ‘డాక్టర్లం మేము కదా.. అది అవసరం లేదు అంటే.. ప్రభుత్వం మాది మేం చెప్పినట్లు వైద్యం చేయండి’ అంటూ గుర్రుమంటున్నారని ఇక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా జరిగితే ఊరుకోం..
డాక్టర్ గారు.. ఈయన మాకు కావాల్సిన మనిషి. ఏదైనా జరిగితే ఊరుకోం అంటూ వైద్యులతో హెచ్చరిస్తున్నట్లు మాట్లాడటం ఆసుపత్రిలో చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతమంది మద్యం తాగి వచ్చి మహిళా వైద్యులు, నర్సులపై కూడా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.
ఎస్పీకి చెప్పినా ఫలితం లేదు
ప్రభుత్వాస్పత్రిలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అది తమ డ్యూటీ కాదని, కేవలం ప్రమాదాలు, ఇతర ఘటనలతో వచ్చే ఎంఎల్‌సీ కేసులను చూసుకోవడమే అని అవుట్‌పోస్ట్ పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఇటీవలే డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొందరు డాక్టర్లు వాపోతున్నారు. ఇటీవల ‘తమ మచిలీపట్నం ఆసుపత్రిలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరిగాయని, ఎమ్మెల్యే తాలుకా’ అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు డాక్టర్లు అనడం గమనార్హం. ప్రతి రోజూ 800 మంది వరకు ఓపీ, నిత్యం 600 మంది వరకు ఇన్ పేషెంట్స్ ఉంటున్నారని, సిఫార్సులు లేకపోయినా ప్రతి రోగికి ఒకే తరహాలో వైద్యం అందిస్తున్నామని వైద్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment