పీఎం సూర్యఘర్ రుణాల మంజూరు వేగవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులకు రుణాల మంజూరుపై శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులు, వెండర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానల్స్ అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 72 వేల రిజిస్ట్రేషన్లు వచ్చినందున, ఇన్‌స్టలేషన్స్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చొరవచూపాలన్నారు. ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తప్పించేందుకు, పర్యావరణ పరిరక్షణకు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ఈ పథకం వీలుకల్పిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ మినహా మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా మంజూరు చేయవలసి ఉంటుందన్నారు. బ్యాంకర్లు త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి ఎం.భాస్కర్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హనుమయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం గాంధీనగర్ లోని ఎన్జీజీఓ హోమ్ లో శనివారం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రహదారులపై వాహనదారుల భద్రతపై నిరంతరం అవగాహన, ప్రచార కార్యక్రమాలు జిల్లా రవాణ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. అవగాహన సదస్సులలో పాల్గొన్న విద్యార్థులు హెల్మెట్ ఆవశ్యకతను ప్రచారం చేయాలన్నారు. హెల్మె ట్ ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాసోత్సవాల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు, రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం వంటి అంశాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, సామాజిక మాధ్యమాలలో తమ వంతు బాధ్యతగా ప్రచారం నిర్వహించిన ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులు హెల్మెట్ ధరించి మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా రవాణాధికారి ఎ.మోహన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం పౌరుల రక్షణ కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని, నగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ ప్రభుదాసు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్, రవాణాశాఖ అధికారి ఆర్.ప్రవీణ్ కుమార్, నెహ్రూయువ కేంద్రం డీవైఓ ఎస్.రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment