హోటళ్ల స్వచ్ఛతా ప్రమాణాలకు రేటింగ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వచ్ఛతా ప్రమాణాలు పాటించే హోటల్స్, లాడ్జీలకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్ (ఎస్‌జీఎల్‌ఆర్‌ఎస్)పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆతిథ్య రంగం కీలకమైందన్నారు. స్థానిక సమాజం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుత పర్యాటకంలో భాగంగా ఆతిథ్య రంగంలో సురక్షిత పారిశుద్ధ్య నిర్వహణను ప్రోత్సహించేందుకు గ్రీన్ లీఫ్ రేటింగ్ వ్యవస్థను ఆవిష్కరించినట్లు వివరించారు.
రేటింగ్స్ ఇలా..
హోటళ్లు, లాడ్జీలు, హోమ్‌స్టేలు, ధర్మస్థలాలు తదితర ఆతిథ్య సౌకర్యాలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తామని కలెక్టర్ చెప్పారు. వన్ లీఫ్ రేటింగ్ పొందాలంటే ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణలో 100–130 మార్కులు రావాలన్నారు. త్రీ లీఫ్ రేటింగ్‌కు 130–180 మార్కులు, ఫైవ్ లీఫ్ రేటింగ్‌కు 180–200 మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించారు. రేటింగ్‌కు సిఫార్సు చేసేందుకు వీలుగా జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండింగ్ ఇంజినీర్ కన్వీనర్‌గా, జిల్లా పర్యాటక అధికారి సభ్య కార్యదర్శిగా కమిటీ ఉంటుందన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్‌డీవో చైర్మన్‌గా వెరిఫికేషన్ ఉప కమిటీ ఉంటుందని తెలిపారు. డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రేటింగ్ వ్యవస్థ గురించి వివరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలోనూ వర్క్‌షాప్‌లతో పాటు శిక్షణ కార్యక్రమాలపైనా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు చైతన్య, కె మాధురి, బాలకృష్ణ, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎస్.విద్యాసాగర్, జెడ్‌పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ స్వామి, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ చైతన్య, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, గ్రామవార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీపీవో పి.లావణ్య కుమారి, జిల్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి టి.రవికుమార్, డీఎల్‌డీవోలు పాల్గొన్నారు.
వన్ లీఫ్, త్రీ లీఫ్, ఫైవ్ లీఫ్ స్టేటస్ ఇచ్చేందుకు కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment