ప్రకృతి వ్యవసాయం భేష్
బాపులపాడు మండలంలో
అమెరికా బృందం పర్యటన
హనుమాన్‌జంక్షన్ రూరల్: ప్రకృతి వ్యవసాయ విధానంతో ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రతను ప్రజలకు చేరువ చేస్తుండటం ప్రశంసనీయమని అమెరికాకు చెందిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో క్రేగ్ కోగట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అమెరికా వాతావరణ మార్పు, సుస్థిర వ్యవసాయ రంగ నిపుణుల బృందం బాపులపాడు మండలంలోని కానుమోలు, కాకులపాడు గ్రామాల్లో శుక్రవారం పర్యటించింది. తొలుత కానుమోలులో గృహిణి అనురాధ నిర్వహిస్తున్న 365 రోజుల కిచెన్ గార్డెన్‌ను సందర్శించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చడించారు. ఇంట్లోకి రోజువారీ కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలను కిచెన్ గార్డెన్ ద్వారా పెరట్లోనే పండించుకునే విధానాన్ని అనురాధ ద్వారా ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఫుడ్ బాస్కెట్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. అనంతరం కాకులపాడుకు చెందిన రైతు చింతయ్యకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అమెరికా బృంద సభ్యులు సందర్శించారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో క్రేగ్ కోగట్ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం నుంచి రైతులకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఏపీసీఎన్‌ఎఫ్ కృషి సాహసోపేతమన్నారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం (వైట్‌హౌస్) నేషనల్ క్లైమెట్ అడ్వయిజర్ జీనా మాట్లాడుతూ రసాయన రహిత వ్యవసాయ మార్గంలో మహిళా స్వయం సహాయక సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బృంద సభ్యుడు, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో కీత్ అగోడా, రైతు సాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment