భూముల రీసర్వేతో సమస్యలకు చెక్
పెనమలూరు: భూములు రీసర్వే చేయించటంతో సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర సర్వే కమిషనర్ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ డీఎల్‌బీఎల్ కుమార్ అన్నారు. మండల పరిధిలో పెదపులిపాక గ్రామంలో భూములపై జరుగుతున్న రీసర్వే పైలెట్ ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ భూములు రీ సర్వే చేయటంతో భూ యజమానులకు మేలు చేయటమే కాకుండా ప్రభుత్వ భూములు గుర్తిస్తామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఈ సర్వే ఉపయోగపడుతుందని వివరించారు. భూ యజమానులు కూడా వారి సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శివప్రసాద్, మండల సర్వేయర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాతృభాషపై మమకారం పెంచుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. అంత ర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని తెలుగుతల్లి విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. జేసీ మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. తెలుగుభాషలోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నా రు. పాఠశాలల్లో భాష ప్రాధాన్యతపై విద్యార్థుల కు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
జీజీహెచ్‌లో
అందుబాటులోకి టిఫా స్కాన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భస్థ పిండంలోని అవయవ లోపాలు, బ్రెయిన్ ఎదుగుదలను గుర్తించేందుకు అవసరమైన టిఫా స్కాన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో ఏర్పాటు చేశారు. దానిని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డాక్టర్ రఘునందన్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అల్ట్రాసౌండ్ మెషీన్‌ల కంటే హై రిజల్యూషన్‌తో పిండం ఎదుగుదల, అవయవాల రూపుదిద్దుకుంటున్న తీరు వంటి వాటిని ఈ టిఫా స్కాన్‌తో కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. అశోక్‌కుమార్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ పార్వతీశంరావు, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ పి. అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
వంశీతో పేర్ని ములాఖత్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు, అభియోగాలు మోపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వంశీతో శుక్రవారం ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖ, పోలీసు అధికారులు కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్న వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యంగా పటమట ప్రాంతానికి చెందిన పోలీసులు దారుణంగా కేసులు కడుతున్నారన్నారని విమర్శించారు. 10వ తేదీ సత్యవర్థన్ కోర్టు ముందు హాజరై.. తన చేత తప్పుడు కేసు పెట్టించారని జడ్జిముందు చెప్పారన్నారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఫణికుమార్ అనే టీడీపీ కార్యకర్త 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టులను, పోలీసులను తప్పుదారి పట్టించారని సత్యవర్థన్, వంశీపై కేసు కట్టారని తెలిపారు. 12న సత్యవర్థన్ అన్న చేత ఫిర్యాదు తీసుకుని కేసు కట్టారన్నారు. ఈ కేసులో ఎక్కడా ఆధారాలు లేవన్నారు. వీటన్నిటిపై వంశీ కుటుంబం న్యాయస్థానాల్లో పోరాడుతుందన్నారు.
అక్కడ లేను.. అయినా కేసు..
రైతులను పరామర్శించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు వచ్చినపుడు, తాను మచిలీపట్నంలో ఉన్నానన్నారు. తన పైన పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దీనిపై డీజీపీకి ఈమెయిల్ లేఖ రాశానన్నారు. మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరి ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు సేకరిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment