ఆక్రమణలే అజెండా..
స.హ.చట్టం జవాబులో స్పష్టంగా..
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామ సర్వే నంబర్ 301లోని 25 సెంట్ల స్థలం తల్లిబోయిన భూలక్ష్మికి చెందిన ప్రైవేటు భూమి అని 22.02.2014లో నూజివీడు తహసీల్దార్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. అదే భూమికి సంబంధించి సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారునికి ఇచ్చిన ఆర్‌సీఆర్‌టీఐ 29/2022 ద్వారా ఇచ్చిన జవాబులో భూమి ప్రభుత్వానికి చెంది నదని స్పష్టంగా పేర్కొనడం పరిశీలనాంశం. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో జిల్లా మంత్రిగా కొలుసు పార్థసారథి కొనసాగడం గమనార్హం.
నూజివీడు మండలం మీర్జాపురంలో ఆక్రమణలకు గురైన భూమి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కూటమి ముఖ్యనేతల అండదండలతో విలువైన నివేశన స్థలాలు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో పచ్చముఠాల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, నేటి కూటమి పాలనలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వర్గాల సహకారంతో రికార్డులను తారుమారు చేయడం రివాజైన భూఆక్రమణదారు.. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో అమాత్యుడి అండదండలతో రూ.కోట్లు విలువ చేసే భూమికి టెండర్ పెట్టాడు.
వ్యూహాత్మకంగా పావులు
పూర్వ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిలోని మీర్జాపురం గ్రామ సర్వే నంబర్ 284/2లో 25 సెంట్ల పట్టాభూమిని 2005లో తల్లిబోయిన వెంకట్రామయ్య నుంచి గోళ్ల లోకేశ్వరరావు కొనుగోలు చేశారు. 2015లో టీడీపీ అధికారంలో ఉండగా 284/2లోని హద్దులనే చూపి సవరణ దస్తావేజు (2361/2015) పేరిట సర్వే నంబరు 301లో 25 సెంట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. వాస్తవంగా పైరెండు సర్వే నంబర్ల మధ్య వందల మీటర్ల దూరం ఉంది. ఆ తర్వాత కొన్ని నెలలకు రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా నమోదైందంటూ మరో సవరణ దస్తావేజు (2380/2015) ద్వారా తన కుమారుడు గోళ్ల లక్ష్మీ పెరుమాళ్ల పేరిట సర్వే నంబర్ 301లోని 1,210 చదరపు గజాలను గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రభుత్వ భూమి, అదీ ఒకే సర్వే నంబర్‌లో విస్తీర్ణాన్ని సెంట్లు, చదరపు గజాలుగా రిజిస్ట్రేషన్ చేయడం పరిశీలనాంశం. సర్వే నంబర్ 301/1, 301/2లోనూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ వ్యవహారాలన్నింటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల ఉన్నతాధికారుల సహకారం మెండుగా ఉండటం గమనార్హం.
వైఎస్సార్ సీపీ హయాంలో..
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మీర్జాపురం ప్రధాన రహదారి వెంబడి జరిగిన భూఆక్రమణలపై కృష్ణా కలెక్టర్, నూజివీడు ఆర్డీఓ తదితర అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ ఆక్రమిత భూమిలో విద్యుత్ వసతి కల్పించి, కనెక్షన్లు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? వాస్తవ స్థితిగతులను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరడంతో నూజివీడు తహసీల్దార్ కార్యాలయం స్పందించక తప్పలేదు. చివరకు సర్వే నంబర్ 301లోని భూమి ప్రభుత్వానిదని నిర్ధారించింది. తొలుత గట్టుగా ఉన్న భూమిని తర్వాత గ్రామ కంఠంగా మార్పు జరిగిందని స్పష్టంగా పేర్కొంది. నూజివీడు మండల రెవెన్యూ శాఖ భూమి రికార్డుల వివరాల ప్రకారం 301/1, 301/2లో.. పట్టాదారు పేరు, అనుభవదారు పేరు వద్ద ఫెయిర్ అడంగల్ దాఖలా అని ఉందే తప్ప ఫలానా వారి భూమి అని పేర్కొనకపోవడం గమనార్హం.
కూటమి సర్కార్‌లో విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ
మీర్జాపురంవాసుల ఫిర్యాదులతో ప్రభుత్వ ఆక్రమిత స్థలంలోని విద్యుత్ కనెక్షన్‌ను 2022 డిసెంబర్‌లో అధికారులు తొలగించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన నెల వ్యవధిలోనే విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ జరిగింది. మంత్రి కొలుసు పార్థసారథికి ప్రధాన అనుచరుడైన గోళ్ల లోకేశ్వరరావు ఆక్రమిత భూమిలో తాజాగా నిర్మాణాలను చేపట్టి వేగవంతం చేశారు. ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను ఎలా కొనసాగనిస్తారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు ప్రస్తుతం కరవయ్యారు.
దశలవారీ 50 సెంట్లు కబ్జా మరో ఏడున్నర ఎకరాలపైనా కన్ను రూ.25 కోట్ల విలువైన భూమికి ఎసరు ప్రభుత్వ స్థలాల దోపిడీకి ‘రెవెన్యూ’ సహకారం మీర్జాపురంలో అక్రమార్కుడిదే హవా
రూ.25 కోట్ల విలువైన భూమిపై కన్ను
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అండ దండలు మెండుగా ఉండటంతో సర్వే నంబర్ 301, 301/1, 301/2లోని భూమిలో లేఅవుట్ వేయడానికి గోళ్ల లోకేశ్వరరావు సన్నద్ధమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడు ఎకరాలకు పైగా ఉన్న భూమి ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.25 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. అంతకుముందు దశలవారీగా ఆక్రమించిన 50 సెంట్లు దీనికి అనుసంధానంగా ఉంది.
గోళ్లపై ఆరోపణలు.. ఫిర్యాదులు
టీడీపీకి చెందిన గోళ్ల లోకేశ్వరరావుపై ఏళ్ల తరబడి భూఆక్రమణలు, మోసాలకు పాల్పడుతున్నారని మీర్జాపురం గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల వారి నుంచి పలు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుత మంత్రి పార్థసారథికి ప్రధాన అనుచరుడైన ఆయన కిరాయి రౌడీలను అడ్డుపెట్టుకుని చేసే దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేదనే రాతపూర్వక ఫిర్యాదులు ఆయా సమయాల్లోని ఉన్నతాధికారులకు అందాయి. పీఏసీఎస్ అధ్యక్షుడిగా పాతిక లక్షలను స్వాహా చేసి నాడు మంత్రిగా ఉన్న పార్థసారథి ద్వారా బయటపడ్డారనే దుమారం రేగింది. రియల్ ఎస్టేట్ మోసాలకు కొదవలేదంటారు. ఓ ఐపీఎస్ అధికారి సమీప బంధువుకు టోకరా వేయడానికి ప్రయత్నించి నాలుక్కరుచుకున్నారనేది వినికిడి. మంత్రి అడుగుజాడల్లో ఉంటూ ఆయన అండదండలతో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
ఆక్రమణలే అజెండా..
ఆక్రమణలే అజెండా..
ఆక్రమణలే అజెండా..
Comments
Please login to add a commentAdd a comment