ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
మైలవరం: ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో శనివారం కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. ప్రతి నెలా మూడో శనివారం ఒక్కో ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న విధానంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. నేను, నా పరిసరాలు పరిశుభ్రతకు రోజూ కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేస్తానని, ఏపీని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దిడంలో కృషి చేస్తానంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీఓ లావణ్యకుమారి, తిరువూరు ఆర్‌డీఓ కె.మాధురి, ప్రత్యేక అధికారి పి.బాలాజీకుమార్, తహసీల్దార్ సుశీలాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మైలవరం రైతుబజార్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment