పేదలపై కూటమి కుట్ర!
● జగనన్న కాలనీల్లో ప్రభుత్వ సర్వే ● స్థలాల స్వాధీనానికి పన్నాగం ● లబ్ధిదారుల్లో ఆందోళన ● కాలనీల్లో అభివృద్ధిని పట్టించుకోని కూటమి పాలకులు
పెనమలూరు: పేదల ఇళ్లపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. సర్వే పేరుతో ఇళ్ల స్థలాల స్వాధీనానికి పన్నాగం పన్నింది. ప్రభుత్వ ఆదేశాలతో కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులు జగనన్న కాలనీలపై సర్వే చేస్తున్నారు. మండల పరిధిలో జగనన్న కాలనీల్లో లబ్ధిదారుల్లో ఎంత మందికి స్థలాలు, గృహాలు కేటాయించింది.. అందులో ఎంత మంది ఇళ్లు కట్టుకున్నారనే అంశంపై సర్వే చేస్తోంది. గృహాలు నిర్మించుకోని లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలోకి వెళితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం అమలుచేశారు. ఇందులో భాగంగా మండల పరిధిలో ఇళ్లు లేని నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేశారు. పెనమలూరులో 9.74 ఎకరాల ప్రభుత్వ భూమి, వణుకూరులో 228.73 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణ చేసి మొత్తం 11,569 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు. గతంలో మండలంలో ఇలా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం లేదు. ఇది జగనన్నకే దక్కింది.
మొదటి ఫేజ్‌లో గృహాలు మంజూరు
జగనన్న పాలనలో రెండు ఫేజ్‌ల్లో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేశారు. మొత్తం 7,400 మందికి గృహాలు మంజూరు చేయగా అందులో 3,407 మంది ఇళ్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు సైతం చేశారు. పెనమలూరు గ్రామంలో గృహాల నిర్మాణం వేగంగా జరిగింది. వణుకూరు లేఅవుటు 1,2,3,4లో లబ్ధిదారులు గృహాలు నిర్మించారు. అయితే లేఅవుటు 5, 6లో నాడు అభివృద్ధి పనులు మొదలుపెట్టినా సార్వత్రిక ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచాయి. కోడ్ కారణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాల మెరక పనులు పూర్తి కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పేదలపై చిన్నచూపు చూసి కాలనీలను పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
నిధులు కేటాయించని కూటమి
ఎన్నికల ముందు వరకు జగనన్న కాలనీల్లో అభి వృద్ధి పనులు జరిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూటమి ఈ కాలనీల అభివృద్ధిని మరిచింది. గతం ప్రభుత్వం మట్టి రోడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు అమర్చింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలకు నిధులు కేటాయించలేదు. అలాగే కొత్తగా గృహాలు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించని లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది.
పట్టించుకునేదెవరు..
జగనన్న కేటాయించిన ఇళ్ల స్థలాల్లో గృహాలు నిర్మించుకుంటామని, తమకు గృహాలు మంజూరు చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అసలు తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదని, కాలనీల్లో వసతుల ఏర్పాటులో వేగం లేదని కూటమి ప్రభుత్వం విఫలమైందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
లబ్ధిదారుల్లో ఆందోళన
జగనన్న పాలనలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు నేడు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇళ్లు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేస్తామని ప్రకటించడం.. ఆందోళనకు కారణమైంది. పైగా అధికారులు జగనన్న కాలనీలపై సర్వే చేయడంతో తమ భవిష్యత్తు ఏమిటని లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. లేఅవుట్లను అభివృద్ధి చేసి గృహాలు మంజూరు చేసి కూటమి ప్రభుత్వం గృహాలు నిర్మించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఏది ఏమైనా మార్చి నాటికి ప్రభుత్వం ఏమి చేస్తుందో తేలనుంది. ఈ దిగువ పట్టిక అఽధికారులు సిద్ధం చేసిన విచారణ నివేదిక.
అధికారుల తనిఖీ
గ్రామం లబ్ధిదారులు నిర్మించిన కట్టని
గృహాలు గృహాలు
యనమలకుదురు 2828 715 2113
కానూరు 3259 589 2670
తాడిగడప 912 256 656
పోరంకి 1458 357 1101
పెనమలూరు 1010 515 495
గంగూరు 663 228 435
గోసాల 397 187 210
వణుకూరు 568 480 88
చోడవరం 193 45 148
పెదపులిపాక 281 35 246
11,569 3,407 8,162
జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణంపై అధికారులు వివరాలను నమోదు చేశారు. జగనన్న కాలనీలో ఎవరు ఇళ్లు నిర్మించారు... ఎవరు నిర్మాణం చేయలేదో నివేదిక సిద్ధం చేశారు. అర్హులకు స్థలాలు కేటాయించారా లేదా అని కూడా విచారణ చేస్తున్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు దళారులు చట్ట విరుద్ధంగా కొనుగోలు చేశారని, దీనిపై కూడా అధికారులు విచారణ చేశారు. అలా స్థలాలు అమ్మినవారి పట్టాలు రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేయని లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఇళ్ల స్థలాల స్వాధీనానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ‘కూటమి’ నేతలకు కట్టబెట్టడానికి పన్నాగం పన్నుతోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment