గురువులకు ‘క్లస్టర్’ తిప్పలు
● కూటమి వింత నిర్ణయంపై ఉపాధ్యాయుల విమర్శలు! ● తూతూమంత్రంగా జిల్లాలో 69 క్లస్టర్ సమావేశాలు ● విద్యార్థులకు సెలవిచ్చి సమావేశం ● పలుమార్లు సాంకేతిక ఇబ్బందులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి శనివారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన క్లస్టర్ సమావేశాలు గందరగోళంగా మారాయి. విద్యార్థులు తరగతులకు సెలవిచ్చి మరీ క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులతో క్లస్టర్ సమావేశాలకు పరుగుతీయాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లాక అడుగడుగునా సాంకేతిక సమస్యలతో సమావేశ లక్ష్యం నీరు గారింది. విద్యాశాఖ సమున్నత లక్ష్యంతో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ‘స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు’ విధానాన్ని సంస్కరణ పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 69 క్లస్టర్లలో జరిగిన సమావేశాలు లక్ష్యానికి భిన్నంగా సాగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో రెండు రోజులు జరిగిన సమావేశాలు
గతంలో రెండు రోజులపాటు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరిగేవి. తొలిరోజు 50 శాతం మంది, తర్వాత రోజు 50 శాతం మందితో నిర్వహించేవారు. దీంతో ఇబ్బందులు ఉండేవికావు. విద్యార్థులకు తరగతులు యథావిధిగా సాగేవి. కూటమి ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్ స్థానంలో క్లస్టర్ విధానం తీసుకొచ్చింది. ప్రతి నెలా మూడో శనివారం క్లస్టర్ సమావేశాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం పూటకు తరగతులను పరిమితం చేసి మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సెలవు ప్రకటించింది.
ఉపాధ్యాయుల అవస్థలు
ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 69 క్లస్టర్లలో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పాఠశాల నుంచి క్లస్టర్ సమావేశం జరిగే ప్రాంగణానికి వెళ్లడానికి సకాలంలో బస్సు సదుపాయం లేక నానా తంటాలు పడ్డారు. 12 గంటలకు పాఠశాల ముగిస్తే భోజనం చేసి ఒంటి గంటకు సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలుండటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పదవీవిరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు, మహిళలు అనేక అవస్థలు పడినట్లు వ్యాఖ్యానించారు. సాయంత్రం వరకూ హాజరు నమోదు యాప్ పనిచేయకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు.
పలుమార్లు సాంకేతిక సమస్యలు
జిల్లాలో దాదాపుగా అన్ని క్లస్టర్ స్కూల్ సమావేశాలకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. స్క్రీన్ ప్రదర్శనతో ఐఎఫ్‌టీ ద్వారా నిర్వహించిన బోధన నైపుణ్య తరగతులకు కొన్నిచోట్ల ఇంటర్నెట్ లింక్ అంతరాయం ప్రతి అరగంటకు ఒకసారి తలెత్తింది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
గతంలో ఉన్న చక్కని పరిస్థితులను తోసిపుచ్చి క్లస్టర్ సమావేశాల పేరుతో నూతన విధానాన్ని తీసుకురావడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయులకు సమయం చాలకపోవడం, హాజరు నమోదుకు అవకాశం ఇవ్వక పోవడం తదితర అంశాలపై జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment