భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం అధికంగా ఉంది. మాఘ మాసం, వివాహాల సుముహూర్తాల నేపథ్యంలో దుర్గగుడిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. నవ దంపతులు పెళ్లి దుస్తులపై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వివాహాలకు హాజరైన వారు తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆదివారం పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడి ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మరోవైపు చిన్నారులకు అన్నప్రాసనలు జరిపించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తజనంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ. 100, రూ. 300 క్యూలైన్‌లో గంట, రూ. 500 క్యూలైన్‌లో గంటన్నర సమయం వేచి ఉండాల్సి వచ్చింది. సామాన్య భక్తులకు తోడు వీఐపీలు, సినీ ప్రముఖులు అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్‌డీ ప్రసాద్ అమ్మవారి ప్రసాదాలను అందించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. క్యూలైన్లు త్వరగా ముందుకు కదలడానికి ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సన్నిధిలో విశేషంగా ఆర్జిత సేవలు
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం పలు ఆర్జిత సేవలు నిర్వహించారు. ఆదిదంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని యాగశాలలో సంకటహర చతుర్ధి రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ నిర్వహించారు. సంకటహర చతుర్ధి పురస్కరించుకుని యాగశాలలో గణపతికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, గణపతి హోమాలను అర్చకులు జరిపించారు. స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు తరలివచ్చి తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ చేశారు. లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మాఘమాసంలో విశేష పర్వదినాల్లో సూర్యోపాసన సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో ఖడ్గమాలార్చన నిర్వహించగా 17 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. చండీహోమంలో 98 మంది, లక్ష కుంకుమార్చనలో 31 మంది, శ్రీచక్ర నవార్చనలో 9 మంది, పంచహారతుల సేవలో 21 మంది ఉభయదాతలు పాల్గొన్నారు.
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
కిటకిటలాడిన క్యూలైన్లు
అమ్మ ఆశీస్సుల కోసం నవ దంపతులు
భక్తజన కోలాహలం
భక్తజన కోలాహలం
Comments
Please login to add a commentAdd a comment