ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ అధ్యక్షురాలు అపర్ణ
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయండి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నిస్తోందని వీటిని రద్దు చేయాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐఎఫ్‌టీయూ) జాతీయ కమిటీ అధ్యక్షురాలు అపర్ణ అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను కార్పొరేట్ కంపెనీల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. స్థానిక సున్నంబట్టీల సెంటర్‌లో ఉన్న పూలే–అంబేడ్కర్ భవన్‌లో ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. అపర్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో కార్మిక వర్గానికి తగిన రీతిలో నిధులు కేటాయించలేదన్నారు. ఉద్యోగుల నూతన పెన్షన్ స్కీమ్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్‌ను అమలుచేయాలన్నారు. విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారానికి 90 గంటలు రోజుకు 15 గంటలు పనిచేయాలని ఎల్‌అండ్‌టీ కంపెనీ చైర్మన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను నిలుపుచేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 15 నుంచి మే 1 తేదీ వరకు మేడే అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలను నిర్వహించాలని సమాఖ్య నిర్ణయించిందన్నారు. సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్, వెంకటేశ్వరావు, వివిధ రాష్ట్రాల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment