నిబంధనలు పాతరేసి.. యథేచ్ఛగా తవ్వకాలు
జి.కొండూరు: ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ బోర్డు నుంచి క్రషర్లు, క్వారీల యజమానులు అనుమతులు పొందకుండానే మైనింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల మైనింగ్ అధికారులు క్రషర్లు, క్వారీల యజమానులతో సమావేశమై క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతనే మైనింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అనుమతులు పొందకుండానే మైనింగ్ నిర్వహణ సాగిపోతోంది. దీనిపై అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల పరిధిలో క్వారీల నిర్వహణ సాగుతోంది. మైలవరం, నందిగామ నియోజకవర్గాలలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో గతంలో 154 క్వారీల వరకు ఉండగా ప్రస్తుతం 69 క్వారీల వరకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్వారీలలో బ్లాస్టింగ్‌ల ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లను క్రషర్లకు తరలించి 40ఎంఎం, 20ఎంఎం, 12ఎంఎం, బేబీ చిప్స్, డస్ట్, వెట్ మిక్స్ ఇలా రకరకాలుగా విభజించి స్థానికంగా నిర్మిస్తున్న కట్టడాలు, రహదారులకు సరఫరా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ క్వారీల నుంచి రోజుకి 500కి పైగా భారీ వాహనాలతో 20వేల టన్నులకు పైగా రాతి సంపదను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని క్వారీల నుంచి ఏడాదికి రూ.300కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది.
నిత్యం బాంబుల మోత..
క్వారీలలో నిబంధనల ప్రకారం 8 అడుగుల లోతు వరకే డ్రిల్లింగ్ వేసి పేలుళ్లు జరిపి కొండ నుంచి రా మెటీరియల్‌ను తీయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసే యంత్రాలతో కొండలకు 50 నుంచి 100 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుళ్ల వల్ల సమీప ప్రాంతాలలో వ్యవసాయ భూములలో పెద్ద పెద్ద బండరాళ్లు పడి పంటలు, డ్రిప్ పైపులు, బోరు బావులు, ధ్వంసమవుతున్నాయి. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి.
అనుమతులు లేకుంటే కఠిన చర్యలు..
ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లేని క్రషర్లు, క్వారీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈసీ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మైనింగ్ బిల్లులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి వారినైనా సహించేదిలేదు. సోమవారం రాత్రి సీజ్ చేసిన వాహనాలలో ఏడు లారీలకు జరిమానా విధించాం.
– వీరాస్వామి, మైనింగ్ ఏడీ
అనుమతులు లేకుండానే క్వారీలు,
క్రషర్ల నిర్వహణ
బిల్లులు లేని కంకర లారీలను
సీజ్ చేస్తున్న అధికారులు
క్వారీలు, క్రషర్‌లపై కేసులెందుకు
పెట్టరంటూ లారీ ఓనర్ల నిలదీత
నిత్యం తమనే దొంగలుగా
చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన
నిబంధనలు పాతరేసి.. యథేచ్ఛగా తవ్వకాలు
Comments
Please login to add a commentAdd a comment