బయటే కొనాలట!
పాన్‌టాప్ మాత్రలూ లేవట
‘‘సార్.. గ్యాస్ ట్రబుల్‌కు వేసుకునే పాంటాప్ మాత్రలు కూడా లేవంటున్నారు. బయట కొనుక్కోమని చెపుతున్నారు’’ అంటూ ఓ రోగి సాక్షాత్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో అమాత్యవర్యులు కంగుతిన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలో ఆయనకు ఈ విధంగా ఊహించని అనుభవం ఎదురైంది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం విజయవాడ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. పలు విభాగాలను సందర్శించిన అనంతరం వైద్యులతో సమీక్ష జరిపారు. లోపాలను సరిదిద్దాలని, అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకోవాలన్నారు.
డైట్‌పై సంతృప్తి
తనిఖీల్లో భాగంగా రోగులకు పెడుతున్న డైట్‌ను పరిశీలించారు. ప్రతిరోజూ ఎన్ని గంటలకు డైట్ పెడుతున్నారు. ఎంత పెడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మెనూ కూడా పరిశీలించారు. అంతేకాదు ఆ డైట్‌ను తిని రుచి చూశారు. బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో అటువైపుగా ఓ రోగిని బంధువులే స్ట్రెచ్చర్‌పై తీసుకెళ్లే దృశ్యాలు చూశారు. అదేమిటని అధికారులను అడగ్గా, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓల కొరత ఉందని వారు మంత్రికి చెప్పారు. న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను అక్కడి వైద్యురాలు ఇవాంజెలిన్ బ్లెస్సీని అడిగి తెలుసుకున్నారు.
విధులకు రాని వారిపై చర్యలు తీసుకోవాలి
విధులకు అనధికారికంగా హాజరు కాని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఈ (అకడమిక్) డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
డ్రైనేజీ అస్తవ్యస్తం
సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను సందర్శించిన ఆయన నాలుగో అంతస్తులోని ఓ టాయిలెట్‌లోకి వెళ్లారు. అక్కడ డ్రైనేజీ పైప్‌లైన్‌లు పూడిపోవడంతో మురుగు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లడాన్ని మంత్రి ప్రత్యక్షంగా చూశారు. అంతేకాదు అక్కడ మంచినీరు కూడా సరిగా రాని విషయాన్ని తెలుసుకున్నారు. ఆ బ్లాక్‌లో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందని, దానికి మరమ్మతులు చేయాల్సి ఉందని వైద్యాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోగులు టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎంతటి దయనీయ స్థితి ఉందో మంత్రి పత్యక్షంగా వీక్షించారు. వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మందుల కోసం గంటల తరబడిక్యూలో ఉండాల్సి వస్తోంది ఓపీల వద్దా అదే పరిస్థితి సాక్షాత్తూ వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌కే ఫిర్యాదు చేసిన పలువురు రోగులు విజయవాడ జీజీహెచ్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు
అన్నీ సమస్యలే...
మంత్రి సత్యకుమార్ యాదవ్ తొలుత అత్యవసర చికిత్సా విభాగాన్ని సందర్శించారు.అక్కడి నుంచి నేరుగా ఓపీ విభాగాలకు వెళ్లారు. ఈఎన్‌టీ, ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఓపీలను పరిశీలించారు. కొన్ని చోట్ల వైద్యులు కాకుండా పీజీలు పరీక్షలు చేయడాన్ని గమనించారు. అక్కడి నుంచి ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లగా రోగులు బారులు తీరి కనిపించారు. రోగుల సహనాన్ని పరీక్షించేలా ఓపీ కౌంటర్ నడుస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఒక్కో చీటీ ఇచ్చేందుకు ఎంత సమయం పడుతుందో ప్రత్యక్షంగా చూశారు. మరిన్ని కౌంటర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఫార్మసీ వద్దకు వెళ్లారు. అక్కడ కూడా రోగులు బారులు తీరి కనిపించారు. మందులు ఇచ్చేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఓ రోగి పాన్‌టాప్ బిళ్లలు కూడా ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వార్డులతో పాటు, సెంట్రల్ డయాగ్నోస్టిక్ బ్లాక్‌ను సందర్శించారు. పలు పరీక్షలు బయటకు రాస్తున్నట్లు రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బయటే కొనాలట!
బయటే కొనాలట!
Comments
Please login to add a commentAdd a comment