కాసులిస్తేనే ఇసుక | - | Sakshi
Sakshi News home page

కాసులిస్తేనే ఇసుక

Published Fri, Feb 21 2025 8:05 AM | Last Updated on Fri, Feb 21 2025 8:02 AM

కాసులిస్తేనే ఇసుక

కాసులిస్తేనే ఇసుక

కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎంపీ అనుచరులు ప్రకృతి వనరులపై కన్నేశారు. ‘నో చలానా.. ఓన్లీ క్యాష్‌’ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా దోచేస్తున్నారు. ఒక్కో లారీకి రూ. 10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని ఎంపీ అనుచరులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పెండ్యాల, చెవిటికల్లు, వేములపల్లి ఇసుక రీచ్‌లన్నీ మూతపడ్డాయి. అదేమంటే ఒక్క రీచ్‌ సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని ఇసుక కొనుగోలు దారులు చెబుతున్నారు. కూటమి పార్టీకి చెందిన నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఎంపీ అనుచరులు ఒకే రీచ్‌ నుంచి ఇసుకను తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్‌ నుంచి రోజుకు 80 నుంచి 100 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారుల సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌ చేసుకున్నా.. తట్టెడు ఇసుక దొరకదని రీచ్‌ల వద్ద ఎంపీ అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టచెప్పితే చాలు దండిగా ఇసుక లోడ్‌ చేస్తున్నారు. ఇటీవల ఓ లారీ యజమానికి ఇసుకరీచ్‌లో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటకు రావటంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలంలోని మూడు ఇసుక రీచ్‌లయిన పెండ్యాల – 1, పెండ్యాల–2, వేములపల్లి రీచ్‌లను మూసివేయించారు.

రోజుకు రూ.10లక్షల ఆదాయం..

చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్‌ నుంచి ఎంపీకి రోజుకు రూ.10లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తులకు వచ్చిన రీచ్‌లను మూసివేయించి కేవలం కాసరబాద రీచ్‌ను తెరిచి రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. రూ.10వేలు చెల్లించిన వారికి ఒక్కో లారీకి 30 టన్నుల నుంచి 40 టన్నుల ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుకను ఎత్తి పోస్తున్నారు. ఇసుక అక్రమంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, వైరా, మధిర, హైదరాబాద్‌, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు.

కూటమి పెద్దల లక్ష్యం అదేనా?

సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు బాగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు సంపాదించాలంటే ఇసుక, మద్యం పాలసీల ద్వారా రాబట్టు కోవాలని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా అంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.100కోట్లకు పైగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు ఇసుక రూపంలో వసూలు చేసుకోవటం తప్పా అని ఎంపీ అనుచరులు అంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ నాయకుడికి సంబంధం లేదని తమ నాయకుడు రూ.200 కోట్లు సంపాదించే వరకు పార్టీ నాయకులెవ్వరికీ వాటాలు ఇచ్చేది లేదని ఎంపీ అనుచరులు ఖరాఖండిగా అంటున్నట్లు తెలుస్తోంది.

క్లియరెన్స్‌ రాగానే ప్రారంభిస్తాం..

నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలంలోని పెండ్యాల–1, పెండ్యాల–2, వేములపల్లి, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామాల్లోని ఇసుక రీచ్‌లకు ఆరు నెలల క్రితం అనుమతి ఇచ్చాం. కానీ ఆ రీచ్‌లను తిరిగి పునరిద్దరించేందుకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. అది రాగానే రెండు రోజుల్లో తిరిగి రీచ్‌లు ప్రారంభిస్తాం. రీచ్‌లలో అక్రమ వసూళ్లు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– వీరాస్వామి,

మైనింగ్‌ ఏడీ విజయవాడ

రూ.10వేలు కొట్టు.. లోడ్‌ పట్టు

టీడీపీ నేతలకు డబ్బు చెల్లిస్తే చాలు.. దండిగా ఇసుక నందిగామ నియోజకవర్గంలో ఎంపీ అనుచరుల హల్‌చల్‌ చలానా సైతం ఇవ్వకుండా దోపిడీ చందర్లపాడులోని కాసరబాద రీచ్‌ నుంచి మాత్రమే ఇసుక తరలింపు మిగిలిన అన్ని రీచ్‌లు మూత మిన్నకుండిపోతున్న రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement