ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ చీరల కుంభకోణం వ్యవహారంపై సోమవారం విచారణ జరిగింది. మహా మండపం ఐదో అంతస్తులోని చీరల విభాగం కార్యాలయంలో విచారణ జరిగింది. 2018–19లో సుమారు రూ.2 కోట్ల విలువైన చీరలకు సంబంధించి లెక్కలు సరిగా లేవని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు దేవదాయ శాఖ ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సోమవారం దుర్గగుడికి వచ్చి చీరల విభాగంలో పలు రికార్డులను పరిశీలించింది. డెప్యూటీ కమిషనర్ కె.బి.శ్రీనివాస్ నేతృత్వంలోని నలుగురు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం తరఫున విచారణాధికారిగా ఉన్న ఏఈఓ సుధారాణి ప్రత్యేక కమిటీకి తన నివేదిక అందజేశారు. 2018 నుంచి 2023వ సంవత్సరం వరకు చీరల విభాగంలో ఎవరెవరూ విధులు నిర్వహించారు, ఈఓలు ఇచ్చిన ఆదేశాల వివరాలతో కూడిన రికార్డులను ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల నాటికి అందుబాటులో ఉంచాలని విచారణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సుమారు గంట పాటు జరిగిన విచారణలో దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment