సారా నిర్మూలనే పల్లెలకు రక్ష
● సారా రక్కసికి బలైపోతున్న కుటుంబ వ్యవస్థ ● సారాను శాశ్వతంగా నిర్మూలించాలంటున్న ప్రజలు ● నిరంతర నిఘా, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలే నిర్మూలనకు సోపానాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పల్లెల్లో విజృంభిస్తున్న నాటుసారాకి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. సారా తయారు చేస్తున్న కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నప్పటికీ సారా తాగి ఎన్నో పేద కుటుంబాలు కుటుంబ సభ్యులను కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి విచ్ఛిన్నమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అక్రమ దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ గత తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాటుసారా తయారీ, విక్రయాలు జోరందుకున్నాయి. సారా శాశ్వత నిర్మూలనతోనే పల్లెల్లో వెలుగులు నిండుతాయని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గిరిజన తండాలే ఆవాసాలు
తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు మండలాల పరిధిలోని గిరిజన తండాల్లోనే ఈ నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. కూలీ పనులకు వెళ్లేవారు నాటుసారా తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. ఈ తండాల్లో అటవీ ప్రాంతాలు, మామిడి తోటలతో పాటు ఇళ్ల ప్రాంగణాల్లోనే పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను భూమిలో పాతిపెట్టి బెల్లం ఊటను నిల్వ చేస్తున్నారు. ఇళ్లలోనే సారా తయారీ చేసే స్థాయికి వెళ్లారంటే ప్రభుత్వ నిఘా ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇప్పటికే ఏ కొండూరు మండల పరిధిలో కిడ్నీ వ్యాధి స్థానికులను వణికిస్తున్న క్రమంలో సారా తయారీ, విక్రయాలు భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.
గ్రామ కమిటీలు, ప్రత్యేక అధికారుల ఏర్పాటు..
సారా ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశామని ఎక్సైజ్ డీసీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక్కొక్క గ్రామానికి అడక్షన్ ఆఫీసర్లుగా, హెడ్ కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించాం. సారా తయారీదారులపై పూర్తిగా దృష్టి పెట్టాం. గ్రామ స్థాయిలో అడక్షన్ కమిటీలో గ్రామ పెద్దలు, అడక్షన్ అధికారి, వీఆర్వో, వీఆర్‌ఏ, గ్రామ మహిళ కార్యదర్శులు, యూత్ అర్గనైజేషన్ సభ్యులను కమిటీలో సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్, ప్రజా ప్రతినిధులు, ఉంటారు. వీరు నెలకు ఒకసారి సమావేశమై, అంతకు ముందు జరిగిన నేరాలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు.
పూర్తిగా రూపుమాపుతాం..
రెండు, మూడు నెలలో ప్రణాళికబద్ధంగా సారాను పూర్తిగా రూపుమాపుతాం. ప్రధానంగా గ్రామ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, సారా తాగడం వలన కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ, వారిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. కళాజాత బృందాల ద్వారా అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. తిరువూరు నియోజకవర్గంలో 103 కేసులు నమోదుచేసి, 15 మందిని అరెస్టు చేశాం. 26 వేల లీటర్ల ఊటను ధ్వంసం చేశాం. గ్రామాల్లో సైతం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దాడులను మరింత ఉధృతం చేస్తాం.
సారా తయారీకి అడ్డుకట్ట !
– ఎకై ్సజ్ డీసీ శ్రీనివాసరావు
నాటు సారా తయారీకి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎకై ్సజ్ డీసీ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సాక్షితో ప్రచురితమైన ‘సారా ఏరులు ! ’ అనే వార్తపై ఆయన స్పందించారు. సారాను పూర్తిగా రూపుమాపేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 40 సారా ప్రభావిత గ్రామాలను గుర్తించామన్నారు. ఈ గ్రామాలను ఏ, బీ, సీ మూడు కేటగిరిలుగా విభజించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సారా కాపు కాసి, తాగడంతో పాటు, ఇతర గ్రామాలకు సారా సరఫరా చేసే గ్రామాన్ని ఏ కేటగిరిగా, గ్రామంలోనే సారా కాసి, తాగే గ్రామాన్ని బీ కేటగిరిగా, బయట గ్రామాల నుంచి సారా తెచ్చుకొనే తాగే గ్రామాన్ని సీ కేటగిరిగా విభజించామన్నారు.
సారా నిర్మూలనకు
సూచనలు
స్థానిక ఎకై ్సజ్‌శాఖ అధికారులు అవినీతికి పాల్పడకుండా నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
సారా తయారు చేసే వారిపై కఠినమైన శిక్షలు అమలు చేయాలి.
సారా తయారీ, విక్రయాలు, తాగడం వల్ల కలిగే నష్టాలపై గ్రామాల్లో అవగాహన
కల్పించాలి.
సారా తయారు చేస్తున్న పల్లెల్లో గ్రామానికి చెందిన చదువుకునే యువకులనే వలంటీర్లుగా నియమించుకొని అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి.
సారా తయారీదారులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో రాయితీలపై రుణాలు ఇప్పించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపాలి.
సారా తయారీ, విక్రయాల వల్ల కేసులు నమోదై సమాజంలో ఆ కుటుంబానికి చెందిన పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించాలి.
నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన నవోదయం కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలి.
సారా నిర్మూలనే పల్లెలకు రక్ష
Comments
Please login to add a commentAdd a comment