టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి
జిల్లా పర్యాటక మండలి(డీటీసీ) సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక మండలి(డీటీసీ) సమావేశం బుధవారం జరిగింది. పర్యాటకం, ఏపీటీడీసీ, మునిసిపల్, రెవెన్యూ, దేవదాయ, ఆర్కియాలజీ–మ్యూజియమ్స్, అటవీ తదితర శాఖల అధికారులతో పాటు హోటళ్ల అసోసియేషన్, టూర్స్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, రోజువారీ పర్యాటకుల సంఖ్య, అందుబాటులో ఉన్న వసతులు, పర్యాటక ప్యాకేజీల రూపకల్పన తదితరాలపై చర్చించారు. జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సమావేశాలు నిర్వహించామన్నారు. విజయవాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు మంచి పర్యాటక అనుభూతిని మిగిల్చేలా పర్యాటక ప్యాకేజీలను రూపొందించామని చెప్పారు. వీటిపై పర్యాటక మండలిలో చర్చించి, సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని మార్పులుచేర్పులు చేసి అందుబాటులో ఉంచుతామన్నారు.
పలు ప్యాకేజీల రూపకల్పన..
ఒక రోజు ప్యాకేజీలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, బేరం పార్కు, కొండపల్లి ఫోర్ట్, పవిత్ర సంగమం, భవానీ ఐలాండ్, బాపూ మ్యూజియం, గాంధీ హిల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ఉంటాయని చెప్పారు. ఇదేవిధంగా రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజుల ప్యాకేజీలను రూపొందిస్తామన్నారు. గైడ్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. ఇదేవిధంగా సిటీ ప్యాకేజీ, టెంపుల్ ప్యాకేజీ, హిస్టారికల్ ప్లేసెస్ ప్యాకేజీ వంటి వాటిని కూడా దశల వారీగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు జిల్లాలో వేదాద్రి, కోటిలింగ హరిహర మహాక్షేత్రం, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, స్వయంభూ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం తదితర ఆలయాలు ఉన్నాయని.. ఈ ఆలయాల వద్ద వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరముందని, తద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. నిర్మాణం పూర్తయిన కొండపల్లి షాపింగ్ కాంప్లెక్స్‌ను త్వరిగతిన అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముక్త్యాల ఏపీ టూరిజం రెస్టారెంట్, గాంధీ హిల్ డిజిటల్ ప్లానిటోరియం/స్పేస్ ఆస్ట్రానమీ సెంటర్, కొండపల్లి ఫోర్ట్ లేజర్ షో, కొండపల్లి గ్రామంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అభివృద్ధి తదితరాలపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ పీఎన్ కృష్ణచైతన్య, విజయవాడ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా అటవీ అధికారి జి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.శ్రీనివాసరావు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment