విజయవాడ డివిజన్‌లో రైల్వే జీఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ బుధవారం విజయవాడ డివిజన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్, ఇతర అధికారులతో కలిసి ముందుగా జీఎం కాకినాడ పోర్ట్ రన్నింగ్ రూమ్‌లో తనిఖీని ప్రారంభించారు. అక్కడ లోకో సిబ్బందికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి వారితో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆయన రన్నింగ్ రూమ్ వద్ద మొక్కలు నాటారు. అక్కడ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్ మాస్టర్ కార్యాలయం, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి రైల్వే వంతెనను క్షుణ్ణంగా పరిశీలించి, రైలు పట్టాల భద్రతా అంశాలను సమీక్షించారు. నిడదవోలు స్టేషన్‌లో చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు జీఎంను కలుసుకుని తమ ప్రాంతాలకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై వినతిపత్రాలు అందజేశారు. చివరిగా ఏలూరు స్టేషన్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment