అత్యంత కచ్చితత్వంతో రీ సర్వే
కంచికచర్ల: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ యజమానుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో భూముల రీ సర్వే పనులు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కంచికచర్ల మండలం గండేపల్లిలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. గ్రామం పరిధిలో సర్వే పురోగతిని రికార్డుల ఆధారంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రీ సర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రీ సర్వే బృందాలు షెడ్యూల్ ప్రకారం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ సభల నిర్వహణ, ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలను భూ వివాద రహితంగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న రీ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్(సర్వే, భూ రికార్డులు) టి.త్రివిక్రమరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ వి.మానస, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, సర్పంచి బి.రవికుమార్, ఏపీఓ రమాదేవి, వీఆర్వో రవికుమార్, పంచాయతీ కార్యదర్శి జిల్లేపల్లి రత్నాకర్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment