వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధరావత్‌ ధర్మారావు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధరావత్‌ ధర్మారావు

Published Fri, Mar 14 2025 1:42 AM | Last Updated on Fri, Mar 14 2025 1:39 AM

వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధరావత్‌ ధర్మా

వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధరావత్‌ ధర్మా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన ధరావత్‌ ధర్మారావును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వెబ్‌సైట్‌లో డీఎస్సీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితా

చిలకలపూడి(మచిలీపట్నం): సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్‌ షాహెద్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోగా ఎంప్యానల్డ్‌ కోచింగ్‌ సంస్థలను ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు వారి ప్రాధాన్యత ప్రకారం ఉచిత డీఎస్సీ ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు వివరించారు.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): పవిత్ర పుణ్యక్షేత్రాలైన సప్త జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) విజయవాడ నుంచి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల లోని యాత్రికులు ఏప్రిల్‌ 8 నుంచి 19వ తేదీ వరకు దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ రైలును నడుపుతున్నట్లు వివరించారు. ఈరైలు విజయవాడ నుంచి ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. 11రాత్రులు, 12రోజులపాటు సాగే ఈ ప్రయాణంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, ద్వారకాలోని నాగేశ్వర్‌, సోమనాథ్‌లోని సోమనాథ్‌ జ్యోతిర్లింగం, పూణేలోని భీమశంకర, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌, ఔరంగాబాద్‌లోని గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుంది. ఈ యాత్రలో ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి బోజన సదుపాయంతోపాటుగా పర్యటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డుమార్గంలో రవాణా సదుపాయం, హోటల్స్‌లో బస ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రతి కోచ్‌కు ఎస్కార్ట్‌, టూర్‌ గైడ్‌, టూర్‌ మేనేజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్యాకేజీ వివరాలు...

మూడు కేటగిరీలుగా ఉన్న ప్యాకేజీలో ఎకానమి(స్లీపర్‌ క్లాస్‌)లో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.20,890, పిల్లలకు రూ.19,555, స్టాండర్డ్‌ (3ఏసీ) పెద్దలకు రూ.33,735, పిల్లలకు రూ.32,160, కంఫార్ట్‌ (2ఏసీ) పెద్దలకు రూ.44,375, పిల్లలకు రూ.42,485గా ధర నిర్ణయించారు. అసక్తికలిగిన వారు విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం లేదా సెల్‌నంబర్లు 9281495848, 92810 30714లో సంప్రదించాలన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ ద్వారా కూడా టిక్కెట్లు బుక్‌చేసుకోవచ్చని వివరించారు.

46 మందికి జరిమానా

విజయవాడలీగల్‌ : నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 46 మంది వాహనచోదకులకు ఎనిమిదో అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానా విధించారు. నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 46 మంది వాహనదారులను గురువారం 2, 4 ట్రాఫిక్‌ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వీరిలో 12మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు, 34మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేస్తామని, వాహనచోదకులు ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు సూచించారు.

బోరుగడ్డ అనిల్‌కు 14 రోజులు రిమాండ్‌

రాజమండ్రి జైలుకు తరలింపు

చిలకలపూడి(మచిలీపట్నం): బోరుగడ్డ అనిల్‌కు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి గురువారం రాత్రి తీర్పు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధిలోని బెరాక వసతి గృహంలో మైనర్‌ బాలిక చనిపో యిన కేసులో బోరుగడ్డ అనిల్‌ సోషల్‌ మీడియా ద్వారా పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నమోదైన కేసుకు సంబంధించి ఇటీవల నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో ఆయనను పోలీసులు అనంతపురంలో అరెస్ట్‌ చేసి మచిలీపట్నం తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం అనిల్‌కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు అనిల్‌ను రాజమండ్రి జైలుకు తరలించారు.

నదిలో పడి వ్యక్తి మృతి

కంచికచర్ల : మొక్కజొన్న విత్తనాలను కాటా వేసేందుకు వెళ్లిన ఓవ్యక్తి బహిర్భూమికని వెళ్లి కృష్ణానదిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందిన సంఘటన గురువారం కంచికచర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం మేరకు వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన పడిగెల సురేష్‌బాబు(43) తోటికూలీలతో కలసి మొక్కజొన్న విత్తనాలను కాటా వేసేందుకు బుధవారం మండలంలోని కొత్తపేట గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో బహిర్భూమికి కృష్ణానది వైపు వెళ్లి, ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అయితే సురేష్‌ ఇంటికి వెళ్లాడనుకుని తోటి కూలీలు వారి గ్రామాలకు వెళ్లారు. సురేష్‌ ఇంటికి చేరకపోవడంతో రాత్రంతా అతనికోసం వెతికారు. కాని అతని జాడ తేలియలేదు. ఈక్రమంలో గురువారం ఉదయం కుటుంబసభ్యులు, తోటి కూలీలు తిరిగి కొత్తపేట గ్రామానికి వెళ్లి కృష్ణానదిలో వెతుకగా, సురేష్‌ మృతదేహం నదిలో తేలియాడుతున్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు సురేష్‌కు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తోంది. సురేష్‌ మృతితో ఆకుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement