మొల్లమాంబ సాహిత్య సేవలు చిరస్మరణీయం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):రామాయణాన్ని అందరికి అర్థమయ్యేరీతిలో సంస్కృతం నుంచి తెలుగులోకి అనుమదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రచయిత్రి మొల్ల చిరుప్రాయంలోనే శ్రీరామచరిత్రను వచన కావ్యంగా రచించారన్నారు. మొల్ల చురుకుదనం, ప్రజ్ఞను గమనించిన రాయలవారు ఆమెను సత్కరించి ప్రోత్సహించారన్నారు. మొల్ల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. శ్రీకంఠేశ్వరుని దేవాలయంలో ఐదు రోజులపాటు రేయింబవళ్లు మల్లమ్మ పద్య రామాయణంను మూడు ప్రతులుగా పూర్తి చేశారన్నారు. మొదటి రామాయణ ప్రతి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చేరిందని అప్పటి విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ముద్రణ గావించి మొల్ల రామాయణంగా ప్రసిద్ధి పొందిందన్నారు. రెండో ప్రతి తమిళనాడులోని తంజావూరు సరస్వతీ గ్రంథాలయం, మూడో ప్రతి కడప జిల్లా సి.పి. బ్రౌన్ గ్రంథాలయానికి చేరాయన్నారు. తెలుగు సాహిత్య రంగానికి మొల్లమాంబ చేసిన సేవలు, తేట తెలుగు పద్య కావ్యం మొల్ల రామాయణం, ఆమె వర్ణనా మాధుర్యం తదితరాలను స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.మహేశ్వరరావు, సహాయ బీసి సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎ రజినీ కుమారి, బి.హేమ ప్రియా, కె.మోజస్, టి.ఆంజనీయులు, పర్యవేక్షకులు ఎస్.జయజ్వోతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు, సిహెచ్ గంగాధరం, బీసీ సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment