ఘనంగా మొల్లమాంబ జయంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అన్నారు. తుమ్మలపల్లి క్షేత్రంలో గురువారం ఏపీ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ కుమ్మరి కులస్తులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతోపాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో శాలివాహన సంఘ భవనానికి ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు కుమ్మరులు తయారు చేసిన వస్తువులను మార్కెట్ లో విక్రయించేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. 50ఏళ్లు నిండిన కుమ్మర కుల వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలని, బడ్జెట్లో కుమ్మరుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. గ్రామాల్లో కుల సంఘ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఐలాపురం రాజా, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మని శ్రీనివాస్, నగర ప్రెసిడెంట్ భర్తవరపు దుర్గాప్రసాద్, సత్యనారాయణమూర్తి కులసంఘీయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment