వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వీఆర్వోల సంఘం ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు విన్నవించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. సచివాలయల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా వీఆర్వోలకు జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్‌కు వివరించారు. పనిభారం తగ్గించాలని, ఇతర శాఖల పనులు కేటాయించడంతో రీ సర్వే పనులు నిలిచిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీఆర్వోల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాసరావు, నందిగామ డివిజన్ అధ్యక్షుడు కె. లీలా ప్రసాద్, విజయవాడ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ బాజీ, ప్రచార కార్యదర్శి హుస్సేన్ తదితరులు ఉన్నారు.
షాపుల నిర్వహణకు వేలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ షాపుల నిర్వహణకు టెండరుదారులను గురువారం ప్రకటించారు. దేవస్థానం ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి శ్రీనివాసరావు సమక్షంలో ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 ఏడాది కాలానికి గాను సీల్డ్ టెండర్లు ఓపెన్ చేసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. భక్తులకు చెవి కుట్టి, చెవి పోగులు విక్రయించుకొను లైసెన్స్ హక్కును మోపిదేవికి చెందిన లకోజి బ్రహ్మనందం రూ. 7,91,000కు దక్కించుకున్నారన్నారు. సీసీ కెమెరాలు రిపేరు, సర్వీసు చేసేందుకు మచిలీపట్నంకు చెందిన టి. కేదార్‌నాథ్ రూ. 1,62,000కు, పెరుగు అన్నం సప్లయి చేసేందుకు మోపిదేవికి చెందిన వీఎల్‌కే గుప్త లీటరు పాలకు రూ. 74, స్వామివారి నిత్యాన్నదానానికి అరటి ఆకులు సరఫరా చేసే లైసెన్సు హక్కును మోపిదేవికి చెందిన కె. రాఘవేంద్రరావు 100 ఆకులకు రూ. 109కు దక్కించుకున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బాల్‌బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జాతీయ అంతర విశ్వవిద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పురుషుల పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన కె.జస్వంత్‌కుమార్‌రాజు, కె.వి.జె.జస్వంత్‌కుమార్, ఎం.ఉదయభాస్కర్, ఎం.ఓబులేసు, ఎన్.శంకర్‌నాయక్, పి.బాలాజిరెడ్డి, పి.రవికిరణ్, టి.రవికిషోర్, ఎం.కౌశిక్ శశాంక్ చౌదరి, పి.శ్రీవివేక్‌కుమార్ జట్టులో చోటు దక్కించుకున్నట్లు వివరించారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. ఈ జట్టుకు మేనేజర్‌గా సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ(ఏలూరు) పీడీ ఎన్.నల్లయ్య వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జట్టు బృందాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ వి.రాధికరెడ్డి వర్సిటీ ప్రాంగణంలో బుధవారం అభినందించారు.
స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి
అత్యాధునిక యంత్రం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజికి చైన్నెకు చెందిన జెడ్‌ఎఫ్ సీవీసీఎస్ ఇండియా లిమిటెడ్ సంస్థ బహూకరించిన ఎయిర్ బ్రేక్ డీబీఎస్ బీఎస్–6 వర్కింగ్ మోడల్ మెషిన్‌ను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బస్సుల బ్రేక్ సిస్టమ్‌పై డ్రైవర్లు, మెకానిక్‌లకు మెరుగైన అవగాహన కల్పించేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుందని తెలిపారు. తద్వారా బస్ బ్రేక్ డౌన్లు, యాక్సిడెంట్లు తగ్గటానికి ఎంతగానో దోహపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్‌ఎఫ్ సీవీసీఎస్ ఇండియా లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్‌పీ సాంబశివరావు, ఏరియా మేనేజర్ ఎన్. సుమన్, ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సీహెచ్ రవివర్మ (అడ్మిన్), టి. చెంగల్‌రెడ్డి(ఇంజినీరింగ్), జి. విజయరత్నం (జోన్–2), జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ బి. నీలిమ పాల్గొన్నారు.
వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment