‘ఉపాధి’లో నాణ్యత డొల్ల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఉపాధి’లో సిమెంట్ రోడ్ల నాణ్యత డొల్లగా మారింది. బరంతుగా బురద మట్టి వేసి మమ అనిపిస్తున్నారు కాంట్రాక్టర్ల ముసుగులోని కూటమి నేతలు. కాసులకు కక్కుర్తిపడి రోడ్ల నిర్మాణాన్ని నాసిరకంగా చేస్తున్నారు. పనులన్నీ నామినేషన్‌పైనే కూటమి నేతలకు కట్టబెట్టారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో నిర్మించిన రోడ్లను ప్రారంభించకుండానే పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్లకు బరంతుతోపాటు, రహదారి, డ్రెయినేజీకి మధ్య గ్యాప్‌లో గ్రావెల్ వాడాల్సి ఉన్నా చెరువులో బురద మట్టిని తెచ్చి వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధి హామీ పఽథకం కింద రూ.80 కోట్లతో 532 పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తూరు తాడేపల్లి పంచాయతీకి రూ.1.04 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను గన్నవరం నియోజకవర్గ ప్రజా ప్రతినిధి తన ముఖ్య అనుచరుడికి అప్పజెప్పడంతో, ఆయన ఇష్టారాజ్యంగా పనులను చేశారు.
రోడ్లకు బీటలు
ఇందులో వేమవరం కాలనీలో నాలుగు సీసీ రోడ్లు వేశారు. రెండు సీసీ రోడ్లకు రూ.29.10 లక్షలు, రెండు సిమెంటు రోడ్లకు రూ.22.80 లక్షలతో పనులు చేశారు. కొత్తూరు ఎస్సీ కాలనీలో రూ.15 లక్షలతో పనులు పూర్తి చేశారు. ఇప్పటికే రూ.67లక్షలతో పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.34 లక్షల పనులకు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ సిమెంటు రోడ్లు ప్రారంభించకుండా పగుళ్లు రావడంపై ఆ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ బదులుగా చెరువులో బురద వేయడంతో, రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల విషయాన్ని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మొత్తం మీద పల్లె పండుగలో భాగంగా చేపట్టిన సిమెంటు రోడ్లపైన విజిలెన్స్ విచారణ చేస్తే అసలు విషయాలు బయటికి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం పనులపైన విచారణ చేయాలని కోరుతున్నారు.
కొత్తూరు తాడేపల్లి పంచాయతీలో రూ.1.04 కోట్లతో సిమెంటు రోడ్లకు నిధులు సీసీ రోడ్లకు గ్రావెల్‌కు బదులు బురద మట్టి మూడు నెలలకే పగుళ్లు
‘ఉపాధి’లో నాణ్యత డొల్ల
Comments
Please login to add a commentAdd a comment