విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని పరిరక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని పరిరక్షించాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక నాయకులకు రాతపూర్వకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్త శుద్ధిని పార్లమెంటు, అసెంబ్లీ తీర్మానం ద్వారా దేశ ప్రజానీకానికి, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజలకు విశ్వాశాన్ని కల్పించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బలిదానాలు, నాటి విద్యార్థుల ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడం ఆంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నాయకుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు తదితరులు ప్రసంగించారు. ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు సాంబశివరావు వ్యవహరించారు. సీఐటీయూ నాయకులు కమల, టీయూసీఐ నాయకురాలు ఎం.సంధ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి వడ్డే డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment