రైతుకు సున్నా! | - | Sakshi
Sakshi News home page

రైతుకు సున్నా!

Published Sat, Mar 15 2025 1:31 AM | Last Updated on Sat, Mar 15 2025 1:30 AM

రైతుక

రైతుకు సున్నా!

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా...
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పుచ్చకాయకు పెరిగిన డిమాండ్‌

జి.కొండూరు: వేసవి తాపాన్ని తీర్చే కాయగా పేరొందిన పుచ్చకాయకు డిమాండ్‌ పెరిగింది. మామిడి కాయ తర్వాత ఆ స్థాయిలో డిమాండ్‌ ఉన్న పుచ్చకాయ పేద, మధ్య తరగతి ప్రజలకు మరింత ప్రియంగా మారుతోంది. ఏడాది పొడవునా లభించే పుచ్చకాయ వేసవిలో మాత్రం ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి దిగుబడి తగ్గిపోవడంతో పాటు మరో వైపు రంజాన్‌ మాసం నడుస్తుండడంతో డిమాండ్‌ పెరిగి పుచ్చకాయ కేజీ రూ.30కి చేరుకుంది. పుచ్చకాయ కొనాలని ఆశగా దుకాణాల వద్దకు వెళ్లిన ప్రజలు ధరలు చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు.

సాగుకు వెనకడుగు

సాగుపై అవగాహన లోపం, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్ల వలన నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లాల్లో పుచ్చకాయ సాగుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. అతి తక్కువ సాగు కాలం 70 నుంచి 80 రోజుల్లో పుచ్చకాయ పంట చేతికొస్తుంది. అయినప్పటికీ ఎన్టీఆర్‌ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాలో కేవలం 26 ఎకరాలలో మాత్రమే పుచ్చ పంటను సాగు చేశారు. దీనిలో ఒక్క జి.కొండూరు మండలంలోనే 19 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటకు తామర పురుగు ఆశించి దిగుబడి తగ్గిపోవడంతో పాటు కాయలకు మంగు రావడంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.

డిమాండ్‌ అధికం

పుచ్చకాయలకు ఎన్టీఆర్‌ జిల్లాలో యమా డిమాండ్‌ ఉంది. విజయవాడ ప్రూట్స్‌ మార్కెట్‌లో పుచ్చకాయలను హోల్‌సేల్‌గా విక్రయించే దుకాణాలు ఏడు ఉన్నాయి. ఈ దుకాణాలకు రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 5వేల టన్నులకు పైగా పుచ్చకాయలు దిగుమతి అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా వేసవిలో రహదారుల వెంబడి స్టాల్స్‌ను ఏర్పాటు చేసి నేరుగా దిగుమతి చేసుకుని మరో వేయి టన్నుల వరకు పుచ్చకాయలను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రతి ఏటా ఈ సమయంలో మార్కెట్‌లో హోల్‌సేల్‌గా పుచ్చకాయలు కేజీ రూ.10 చొప్పున రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో పాటు రంజాన్‌ మాసం జరుగుతుండడంతో మార్కెట్‌లోనే క్వాలిటీని బట్టి పుచ్చకాయ కేజీ రూ.18నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులు కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ప్రాంతాలను బట్టి విక్రయిస్తున్నారు. స్థానికంగా జిల్లాలో పుచ్చకాయ సాగు వైపు రైతులు మొగ్గు చూపితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

అతి తక్కువ కాలంలో పంట చేతికొస్తుంది. రబీలో ఈ పంట సాగుకు ఎన్టీఆర్‌ జిల్లా అనుకూలంగా ఉంటుంది. మల్చింగ్‌కు హెక్టారుకు రూ.16వేలు, రాయితీపై డ్రిప్‌ పరికరాలను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈ పద్ధతిలో సాగు చేస్తే నీటి వినియోగం కూడా తగ్గించుకోవచ్చు. పురుగులు, తెగుళ్లను అరికట్టడానికి రసాయనిక పద్ధతులే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను కూడా రైతులు చేపడితే ఫలితాలు వస్తాయి. పుచ్చకాయ విత్తనాలకు హెక్టారుకు రూ.3వేలు ఇస్తున్నాం. మార్కెట్‌ మూవ్‌మెంట్‌ను గ్రహించి సాగు చేపడితే పుచ్చసాగులో లాభాలను ఆర్జించవచ్చు.

–పి.బాలాజీకుమార్‌,

ఎన్టీఆర్‌ జిల్లా హార్టీకల్చర్‌ అధికారి

పుచ్చకాయ వలన కలిగే లాభాలు

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండడం వలన శరీరానికి తగినంత నీటిని అందించి డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం, లైకోపిన్‌లు గుండె జబ్బులను తగ్గిస్తాయి. పుచ్చకాయలో ఉండే విటమిన్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు చర్మాన్ని మెరుగు పరుస్తాయి. పుచ్చకాయలో ఉండే ‘సి’విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్‌‘ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్‌లు కండరాల నొప్పులను తగ్గిస్తాయి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వలన శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ తినడం వలన మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

పుచ్చసాగుకు వెనకడుగు వేస్తున్న స్థానిక రైతులు

ఎన్టీఆర్‌ జిల్లాలో రబీలో 26 ఎకరాలలో మాత్రమే సాగు

ఏడాదికి 5వేల టన్నుల పుచ్చకాయ దిగుమతి

రిటైల్‌గా పుచ్చకాయ కేజీ రూ.30

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుకు సున్నా! 1
1/2

రైతుకు సున్నా!

రైతుకు సున్నా! 2
2/2

రైతుకు సున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement