మా భవిష్యత్తుతో ఆటలాడొద్దు
కంకిపాడు: కోటి ఆశలతో ఐఐటీ–మెడికల్ అకాడమీలో సీటు దక్కించుకుని విద్యనభ్యసిస్తున్న తమ జీవితాలతో ఆటలాడొద్దని, ఐఐటీ–మెడికల్ అకాడమీ తరలింపుతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చొద్దంటూ విద్యార్థులు గళం విప్పారు. రెండో సంవత్సరం కూడా ఐఐటీ–మెడికల్ అకాడమీని కొనసాగించి తమ బంగారు భవితకు పునాదులు వేయాలని, ఆడ పిల్లల చదువులను నిర్లక్ష్యం చేయొద్దంటూ మొరపెట్టుకున్నారు. ఈడుపుగల్లు గ్రామ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీ తరలింపు నేపథ్యంలో విద్యార్థులు, వారికి మద్దతుగా తల్లిదండ్రులు శుక్రవారం అకాడమీ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వద్ద నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనగా అకాడమీ వద్దకు చేరుకుని బైఠాయించారు. పోటీ పరీక్షలు రాసి సీటు దక్కించుకున్నామని, ఐఐటీ–మెడికల్ సీట్లు సాధించాలనే తమ లక్ష్యాన్ని నీరుగార్చొద్దంటూ నినాదాలు చేశారు. ప్రతిభ గల విద్యార్థులను కేవలం భవనం అద్దె సాకుతో నిర్లక్ష్యం పాలుచేయొద్దంటూ ఆవేదన వెలిబుచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ ఏడాది ఐఐటీ నోటిఫికేషన్ నిలుపుదల చేశారని, మొదటి సంవత్సరం చదివిన తమను రెండో సంవత్సరం విద్య కూడా మెడికల్ అకాడమీలోనే పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మూడు ఐఐటీ అకాడమీల్లో బాలికలకు ప్రత్యేక అకాడమీ ఈడుపుగల్లు ఒక్కటేనని, ఆడపిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి 2025–26 విద్యాసంవత్సరానికి అకాడమీని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈడుపుగల్లులోనే మెడికల్ అకాడమీ కొనసాగించాలి
అకాడమీ వద్ద విద్యార్థులు, వారికి మద్దతుగా తల్లిదండ్రుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment