పౌర్ణమి వేళ.. దుర్గమ్మ సన్నిధి కిటకిట
స్వర్ణకవచంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఫాల్గుణ పౌర్ణమి, శుక్రవారం, హోళీ సెలవు, వివాహ సుముహూర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని దుర్గమ్మ స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి.
అంతరాలయ దర్శనం రద్దు...
శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. ఉదయం 10 గంటలకు ఘాట్‌రోడ్డులోని సమాచార కేంద్రం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. మరో వైపున మహా మండపం మీదగా వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే అనుమతించారు. 10 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు 11–40 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అంతరాలయ దర్శనం రద్దు చేసి ముఖ మండప దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పౌర్ణమి, శుక్రవారం నేపథ్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన అన్ని ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే ఖడ్గమాలార్చనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచ హారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment