నాగావళిలో బాలుడి దుర్మరణం
రాయగఢ: స్థానిక చెక్కాగుడ సమీపంలోని నాగావళి నదిలో మునిగి ఒక యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడు విజయవాడలోని పాడుమెట్టలో నివసిస్తున్న పి.మురళి కుమారుడు సాయికృష్ణ(16)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పి.మురళి కుటుంబంతో సహా మొత్తం 16 మంది మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి వచ్చారు. అనంతరం చెక్కాగుడలోని రోప్‌వే బ్రిడ్జిని సందర్శించేందుకు వెళ్లారు. రోప్ వే బ్రిడ్జి కింద పారుతున్న నాగావళి నదిలో సాయికృష్ణ స్నానానికి దిగాడు. ఈ సందర్భంగా నది మధ్యలోకి వెళ్లి ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నది తీవ్రతకు అదుపు తప్పి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరహా ప్రమాదాలు తరచూ ఇక్కడ చోటు చేసుకుంటుండడంతో జిల్లా యంత్రాంగం రోప్ వే బ్రిడ్జిని నిషేధిస్తూ పర్యాటకులు వెళ్లకుండా ప్రవేశ ద్వారాన్ని ఇదివరకే మూసివేసింది. అయితే కొంతమంది పర్యాటకులు రోప్ వేని చూసేందుకు వెళ్లి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జనాభా గణనలో మాల ఆది ఆంధ్రులకు అన్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రతిపాదించిన రెల్లి కులానికి ఒక శాతం, మాదిగ కులానికి ఆరున్నర శాతం, మాల కులానికి ఏడున్నర శాతం రిజర్వేషన్లను ఉప వర్గీకరించడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నూతలపాటి జగదీష్ మాట్లాడుతూ 2024 ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చనే హక్కును తెలియజేస్తూ వాటికి నియమ నిబంధనలు విధించిందన్నారు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడెన్సును పూర్తిగా పక్కకు పెట్టి, జనాభా దామాషా ప్రకారం ఉప వర్గీకరణ చేస్తామని ఒక వార్తను బయటకు విడుదల చేసిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అయితే తప్పనిసరిగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఎస్సీల వాస్తవ గణాంకాలను సేకరించాలని, అందుకు ఉద్యోగాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకుని వివిధ కులాల వెనుకబాటుతనాన్ని నిర్ధారించి అప్పుడు మాత్రమే ఉప వర్గీకరణ చేయాలన్నారు. సమావేశంలో సంఘం కార్యదర్శి అంబటి అనిల్ కుమార్, అఖిలభారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, నాయకులు శ్యామ్ కుమార్, డాక్టర్ ముద్ద అంకయ్య, బేతాళ సుదర్శనం, సయ్యద్ భావన, పలువురు ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
నాగావళిలో బాలుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment