వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలంలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మండలంలోని ఎ.సీతారామపురం వద్ద హైవేపై ముందు వెళుతున్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందింది. కారు డ్రైవర్ రవి అతి వేగంతో నిర్లక్ష్యంగా కారు నడపటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన పెద్దు పద్మావతి (72), ఆమె కుమారుడు వేణుమాధవ్, కోడలు తేజస్వినితో కలిసి కొవ్వూరులోని శ్రీరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కంటైనర్ లారీ కింద ఇరుక్కుపోవటంతో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న పద్మావతి తల భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. స్వల్ప గాయాలతో బయట పడ్డ డ్రైవర్ రవి, వేణుగోపాల్, తేజస్వినిలను చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పద్మావతి మృతదేహానికి గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై వీరవల్లి ఎస్‌ఐ శ్రీనివాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హోసన్నా మందిరం వద్ద...
జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ శివారులోని హోసన్నా మందిర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శేరీనరసన్నపాలెంకు చెందిన బొల్లిగర్ల నాగేశ్వరరావు (42) దుర్మరణం చెందాడు. కాలినడకన వెళుతున్న నాగేశ్వరరావును వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment