సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో అనర్థాలు
భూపరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి
ఇబ్రహీంపట్నం: సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని జూపూడిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో ఎమెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను తిరిగి వినియోగించకుండా మనం చేసే చిరు ప్రయత్నం భావి తరాల బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుందన్నారు. వాడేసిన ప్లాస్టిక్ లోని మైక్రో ప్లాస్టిక్‌తో క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటి చెప్పి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను తిరిగి వినియోగించకుండా పెద్దఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంతో ఆస్పత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోటా స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిషేధాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్టు తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, సర్పంచ్ కె.దేవమాత, డీపీఓ పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, తహసీల్ధార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సునీతశర్మ, ఈఓపీఆర్డీ మనోజ్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment