రౌడీషీటర్ దారుణ హత్య
● వెంకటేష్‌ను హతమార్చిన మిత్రులు ● మద్యం మత్తులో వివాదమే కారణం
ఇబ్రహీంపట్నం: రౌడీషీటర్ జరబల వెంకటేష్ (42) తన స్నేహితుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన వివాదంలో మిత్రులు బండరాళ్లు, కర్రలతో వెంకటేష్‌పై దాడి చేశారు. ఇబ్రహీం పట్నం ఫెర్రీ లాంచీ రేవు సమీపంలో శనివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్‌ఐ విజయలక్ష్మి కథనం మేరకు.. కంచికచర్లకు చెందిన జరబల వెంకటేష్ ఐదేళ్లుగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. టీడీపీ సానుభూతి పరుడిగా ఉండే వెంటేష్ స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్నేహితులు పెరుమాల వేణు, సీహెచ్.వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజుతో కలసి మద్యం తాగాడు. మద్యం మత్తులో నలుగురు మధ్య తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీసింది. వేణు, వీరాంజనేయులు, వీర్రాజు బండరాళ్లు, కర్రలతో దాడిచేసి వెంటేష్‌ను తీవ్రంగా గాయపర్చారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. మృత దేహానికి పంచ నామా నిర్వహించి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితులు వేణు, వీరాంజనేయులు, వీర్రాజును గంటల వ్యవధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కంచికచర్లకు చెందిన యార్లగడ్డ విజయ్ హత్యకేసులో వెంకటేష్ నిందితుడు కావడంతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెంకటేష్ హత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.
రౌడీషీటర్ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment