స్వచ్ఛ చల్లపల్లి రాష్ట్రానికే ఆదర్శం
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చల్లపల్లి: స్వచ్ఛ సుందర చల్లపల్లి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని, రానున్న నెల రోజుల్లో ప్లాస్టిక్ క్యారీబాగుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యాక్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజామున కలెక్టర్ బాలాజీ స్థానిక అధికారులు, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలతో కలిసి గ్రామాల్లోని వీధులను శుభ్రం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం, చల్లపల్లి ప్రధాన సెంటర్, షాబుల్‌బజార్ వీధిలో చీపురు చేతపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. ప్రజల నుంచి వేరువేరుగా సేకరిస్తున్న చెత్తను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడే లేని విధంగా కొన్ని సంవత్సరాల నుంచి నిత్యం తెలవారుజామున స్వచ్ఛ కార్యకర్తలు వీధులను శుభ్రం చేస్తుండటంతో చల్లపల్లికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. వ్యాపారులు కూడా వినియోగదారులకు ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు ప్రత్యామ్నాయాలను వాడాలని సూచించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లిని తీర్చిదిద్దడంతో కృషి చేస్తున్న సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావును అభినందించారు. స్వచ్ఛ చల్లపల్లి రథసారథులు డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, పద్మావతి దంపతులు, స్వచ్ఛ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment