ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మూడు పరీక్షలు మినహా మిగిలిన పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 103 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 80,272 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో ఓకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు 2,285 మంది ఉన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరైన వారిలో మొదటి ఏడాది విద్యార్థులు 40,008 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 37,979 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మూడు చొప్పున పరీక్షలు జరగాల్సి ఉంది. వీటికి హాజరయ్యే వారి సంఖ్య చాలా స్వల్పంగా కొన్ని కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు జరగనున్నాయి.
స్వస్థలాలకు బయలుదేరుతున్న విద్యార్థులు
శనివారం పరీక్ష రాసిన తరువాత పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. పరీక్షలు పూర్తికావటంతో హాస్టళ్లను ఖాళీచేసి స్వస్థలాలకు బయలుదేరారు. ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక వేల మంది విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది విద్యార్థులు గురువారమే తమ ఊర్లకు వెళ్లిపోయారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శని వారం బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment