యువగళం హామీలు అమలు చేయాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులు, యువతకు యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ధర్నా జరిగింది. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు, పీజీ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను పాత పద్ధతుల్లో నిర్వహించాలని, వెటర్నరీ విద్యార్థుల స్టైపెండ్ రూ.25 వేలకు పెంచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే 107, 108 జీఓలను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ ధర్నాను ఉద్దే శించి శివారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పీజీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు రద్దు చేసి, ఆయా యూనివర్సిటీలు సొంతగా ప్రవేశ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందెల నాసర్ జీ మాట్లాడుతూ.. పశువైద్య విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరెర్స్ కుళ్లాయిస్వామి, సాయికుమార్, చలపతి, నాగభూషణం, ఫణీంద్ర, షాబీర్ బాషా, నవ్య శ్రీ, రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment