వినియోగదారులు హక్కులను పరిరక్షించుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినియోగ దారులు హక్కులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకుని పరిరక్షించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ దీపం 2 పథకం, ఆహార భద్రత ప్రమాణాలు, తూనికలు– కొలతల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, పరిమాణం, ధర ప్రమాణాలకు సంబంధించి తగిన సమాచారాన్ని కలిగి ఉండడమే కాక ఏదైనా దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా రక్షించే హక్కు వినియోగదారు హక్కు అని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, నిత్య జీవితంలో రోజూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేస్తుంటారన్నారు. ప్రజలు మోసానికి గురైతే పోనీలే అనే నిర్లిప్త ధోరణిని వీడి వినియోగ దారుల హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది సుస్థిర జీవనశైలికి మార్పు ఇతివృత్తంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని వివరించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు కీలక భాగస్వాములవుతున్నాయని తెలిపారు. అధికారులు కూడా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అప్రమత్తతతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేయాలన్నారు. మారుతున్న అవసరాలు, మార్కెట్ ధోరణులు, సాంకేతికత అనుసంధాన ఈ–కామర్స్, ఆన్‌లైన్ లావాదేవీలకు అనుగుణంగా వినియోగదారుల రక్షణ చట్టాలు అమలవుతున్నాయని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు శశికళ వివరించారు. యూఎన్‌వో మార్గదర్శకాలు తదనంతరం చట్టాల రూపకల్పన, 1986 నాటి చట్టం, 2019 చట్టంలోని ముఖ్యాంశాలు తదితరాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎస్‌వో ఎ.పాపారావు, లీగల్ మెట్రాలజీ అధికారి ఎ.కృష్ణచైతన్య, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment