వట్టిపోయిన మున్నేరు
కంచికచర్ల: నాడు నిండుకుండలా జలకళతో కనపడిన మున్నేరు నేడు నీటిచుక్కలేక వట్టి పోయింది. మున్నేరులో జల లేక తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రబీ సీజన్‌లో రైతులకు సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పూర్తి వేసవి రాక ముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. కంచికచర్ల మండలం మున్నేరు ఉపనది నుంచి మున్సిపాలిటీ అయిన నందిగామ, మండల కేంద్రం కంచికచర్ల, గండేపల్లి, కీసర, పెండ్యాల, వేములపల్లి, పెండ్యాల, ఎస్.అమరవరం, మోగులూరు, పేరకలపాడు, గండేపల్లి తదితర గ్రామాలకు మున్నేరు నుంచి రక్షిత మంచినీటి పఽథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. మున్నేరులో నీరు లేక రక్షిత మంచినీటి పథకానికి ఏర్పాటు చేసిన బోర్లకు నీరు అందడంలేదు.
మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ మోటార్లు, బోర్లు
మున్నేరు ఉపనదిలో నందిగామ, కంచికచర్ల పట్టణాలతో పాటు పలు గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకానికి గత ప్రభుత్వాలు బోర్లు ఏర్పాటు చేశాయి. మున్నేరులో నీరు లేక ఈ బోర్లకు నీరు అందకపోవడంతో వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురవుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు అంటున్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం.. పంచాయతీలో నిధులు లేకపోవటంతో సకాలంలో మోటార్లను బాగు చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి వేసవి రాకముందే గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆరోపిస్తున్నారు.
రబీలో అందని సాగునీరు
రైతులు మున్నేరు పరిసర ప్రాంతాల్లో రబీ సీజన్‌లో మొక్కజొన్న, మినుము, తదితర పలు రకాల పంటలను సాగుచేశారు. నీరు లేకపోవడంతో మున్నేరుపై ఉన్న ఎత్తిపోతలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారు. పశుపక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి.
మినరల్ వాటర్ ప్లాంట్లే దిక్కు
రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు సక్రమంగా సరఫరా జరగక కొంతమంది తాగునీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మినరల్ వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో 20 లీటర్ల క్యాను రూ. 20 నుంచి రూ.30 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మినరల్ వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
ఎమ్మెల్యేకు చెప్పినా.. స్పందన లేదు
పరిటాల గ్రామానికి తాగునీరు సక్రమంగా సరఫరా కావట్లేదని చెవిటికల్లులోని కృష్ణానది నుంచి తాగునీటి పైపులువేసి గ్రామానికి సరఫరా కావడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు గ్రామస్తులు విన్నవించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేసి గ్రామానికి తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చే తాగునీటితో కాలం వెళ్లబుచ్చుతున్నా మని చెప్పినా ఫలితం లేదని మహిళలు అంటున్నా రు. పాలకులు, అధికారులు స్పందించాల్సి ఉంది.
నాడు మున్నేరుకు జలకళ
నేడు చుక్క నీరు లేదు
తప్పని తాగునీటి తిప్పలు
పలుగ్రామాల్లో వారానికి ఒకసారి
నీటి సరఫరా
పట్టించుకోని పాలకులు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment