పంచాయతీకో మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యాన సంఘ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టి.ఎస్.మల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం విద్యారంగ – ఆర్థిక సమస్యల సాధనకు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి లక్ష్మణరావు మాట్లా డుతూ.. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీల్లో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పంచాయతీల్లో సాధ్యం కాకపోతే విడుతల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లతో పాటు ఐదు తరగతి గదులు, అన్ని సౌకర్యాలు ఉండే విశాలమైన పాఠశాలగా తీర్చిదిద్దాలన్నారు. అందుకు బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 60 మంది పైగా విద్యార్థులు ఉంటే హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, లేకపోతే యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు, దాని ఫలితాలు, భవిష్యత్‌లో ఏర్పడబోయే సమస్యలు, ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి సదస్సును విజయవాడలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్, సహాధ్యక్షులు కుసుమకుమారి, లక్ష్మీరాజా, సుభాషిణి, శ్రీలక్ష్మి, ఉమామమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment