అన్ని వర్గాలను ఆకట్టుకునే ‘రాబిన్‌హుడ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో కూడిన రాబిన్‌హుడ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ చిత్ర హీరో నితిన్ అన్నారు. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న విడుదల కానున్న రాబిన్‌హుడ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్‌ను విజయవాడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందని, రాబిన్‌హుడ్ కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ విజయవాడలో చదువుకుని దర్శకుడిగా మారినట్లు తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అన్నారు. క్రికెటర్ వార్నర్‌ను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారన్నారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.
చిత్ర హీరో నితిన్
Comments
Please login to add a commentAdd a comment