అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రేమ, నిస్వార్థంతో కూడిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత గొప్ప వ్యక్తుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరేందుకు కృషిచేయాలని సూచించారు.
చిన్న తిరుపతికి
కూరగాయల వితరణ
గన్నవరం: ద్వారకాతిరుమలలోని శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్య అన్నసమారాధనకు గన్నవరం గ్రామస్తులు 3,500 కిలోల కూరగాయలను వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌ను పుర ప్రముఖులు నెక్కలపూడి ఈశ్వరరావు, మండల వెంకటప్రభాకరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 11 టన్నులు, శ్రీశైలం ఆలయానికి 4 టన్నులు కూరగాయలను గన్నవరం నుంచి పంపించినట్లు తెలిపారు. తొలిసారిగా చిన్నతిరుపతికి కూడా కూరగాయలను అందజేసినట్లు చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి కూరగాయలను వితరణగా అందజేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పుర ప్రముఖులు తుమ్మల మురళీకృష్ణ, కాసన్నేని బాబురావు, కొణసాని నాగేశ్వరరావు, కాసన్నేని శ్రీనివాసరావు, చిలకపాటి సీతారామయ్య, తుమ్మల జితేంద్ర, ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్‌కు
అభినందన సర్టిఫికెట్
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టర్ డీకే బాలాజీకి అభినందన సర్టిఫికెట్ మచిలీపట్నం యోగా గురువు గురునాథబాబు, ఆల్ ఇండి యా యోగా ప్రిన్సిపాల్ డాక్టర్ దమయంతి శర్మ అందజేశారు. ఆదివారం కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పరిషత్ కల్యాణమండపంలో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేశారు. ఈ నమస్కారాలు చేసినందుకు యోగా గురువులు, ప్రిన్సిపాల్ ఆయనకు అభినందన సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో యోగా గురువులు పాల్గొన్నారు.
ముగిసిన జూడో
రాష్ట్ర క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూడో జూనియర్ బాల, బాలికల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల అనంతరం ఈ నెల 28 నుంచి డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో విజయవాడకు చెందిన పి.ప్రవళ్లిక, ఎం.కీర్తన, బి.భావన, ఆర్.కోటేశ్వరి, జి.గగన్‌సాయి చోటు దక్కించుకున్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జూడో రాష్ట్ర సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, అధ్యక్షులు గణేష్ సుబ్బారావు, కార్యదర్శి ఎన్.పవన్‌సందీప్, ప్రతినిధులు విజేతలకు మెడల్స్ అందజేశారు.
అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
అమరజీవి త్యాగం.. చిరస్మరణీయం
Comments
Please login to add a commentAdd a comment