ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనాలను రద్దు చేసి, ముఖ మండప దర్శనానికే అనుమతించారు. అయితే దేవస్థానం పండుగలు, పర్వదినాలతో పాటు వీకెండ్‌లో ఏర్పాటు చేసిన వీఐపీ, ప్రొటోకాల్ ప్రత్యేక సమయాలు అమలు కాకపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కిక్కిరిసిన కొండ..
ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంలో ఖడ్గమాలార్చనతో పాటు లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆలయప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఆర్జిత సేవలలో పాల్గొనే ఉభయదాతలు, అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంతో పాటు ఘాట్‌రోడ్డు, మహామండపం లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. ఉదయం 10 గంటలకే అన్ని క్యూలైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ప్రముఖులతో పాటు సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే వారిని ముఖ మండప దర్శనానికి అనుమతించారు. మహా మండపం వైపున వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకు అనుమతించి అక్కడి నుంచి క్యూలైన్‌లోకి మళ్లించారు. మరో వైపున అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి
అంతరాలయ దర్శనం రద్దు
అమలు కాని వీఐపీ,
ప్రొటోకాల్ టైం స్లాట్
సామాన్య భక్తులకు తప్పని ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment