గ్రేటర్ వద్దు.. ఎన్నికలే ముద్దు
● తాడిగడప మునిసిపాలిటీ ఎన్నికలకు సన్నాహాలు ● గ్రేటర్ విజయవాడలో విలీనంపై నీలినీడలు ● జూన్ లేదా జూలైలో ఎన్నికలంటూ ప్రచారం
పెనమలూరు: గ్రేటర్ విజయవాడలో తాడిగడప విలీనం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీకి ఎన్నికలు నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు నిర్వహించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. 2020వ సంవత్సరంలో తాడిగడప మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. పోరంకి, తాడిగడప, యనమలకుదురు, కానూరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తాడిగడప మునిసిపాలిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పంచాయతీలను విలీనం చేసి పలు మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేయటంపై వివాదం తలెత్తి పలువురు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో తాడిగడప మునిసిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. మునిసిపాలిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తాడిగడప అధికారుల పాలనలోనే ఉంది.
గ్రేటర్‌లో విలీనంపై వెనుకడుగు
తాడిగడప మునిసిపాలిటీని విజయవాడ కార్పొరేషన్‌లో విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా మార్చు తారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం తాడిగడపను గ్రేటర్‌లో విలీనం చేయడం లేదని సమాచారం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండటంతో తాడిగడపను విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. ఎన్నికలు జరగకపోవటంతో తాడిగడప మునిసిపాలిటీకి ఇప్పటికే 15 ఆర్థిక సంఘం నిధులు అందలేదు. తాజాగా 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా చేజారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాడిగడపకు ఎన్నికలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఎన్నికలు జరిగితే రూ.50 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు తాడిగడప మునిసిపాలిటీకి సమకూరే అవకాశం ఉంది. ఎన్నికలు సకాలంలో జరగకపోతే ఆర్థిక సంఘం నిధులకు చేజారే అవకాశం ఉంది. కార్పొరేషన్‌లో మునిసిపాలిటీని విలీనం చేస్తే ప్రజలపై అదనంగా పన్నుల భారం పడుతుందని, దీని వల్ల పార్టీ మైలేజీ దెబ్బతింటుందని టీడీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారని సమాచారం.
టీడీపీ నేతల సమావేశం
తాడిగడప మునిసిపాలిటీ ఎన్నికలపై స్థానిక టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిసింది. జూన్ లేదా జూలైలో తాడిగడపలో ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో చెప్పినట్లు ప్రచారం జరుగు తోంది. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.
అధికారంపైనే ఆశ
అధికార పార్టీ నేతలకు తాడిగడప మునిసిపాలిటీ బంగారు బాతుగుడ్డులా మారింది. విజయవాడ నగర శివారులో ఈ మునిసిపాలిటీ ఉండటంతో రియల్ ఎస్టేట్, అపార్టుమెంట్‌లు, అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుటులు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయ కులు, అధికారులకు ఈ మునిసిపాలిటీ కాసుల వర్షం కురిపిస్తోందన్న ప్రచారం ఉంది. తాజాగా ఎన్నికలు జరిగి, అధికారం చేపడితే దండిగా దండుకోవచ్చని అధికార పార్టీ నాయకులు ఆశతో ఉన్నారని సమాచారం. తాజాగా ఎన్నిలు జరుగుతాయన్న సమాచారంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment