ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం
● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈఓ, కలెక్టర్ ● తొలి రోజు 268 మంది విద్యార్థులు గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో పదో తర గతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 168 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,711 మంది రెగ్యులర్ విద్యార్థులకు, 27,443 మంది పరీక్షకు హాజరయ్యారు. 268 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 44 మంది ప్రైవేట్ విద్యార్థులకు 39 మంది హాజరయ్యారని వెల్లడించారు. తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 99.03 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పరీక్షలకు ఒకరు గైర్హాజర య్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. వంద మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరయ్యేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. హాల్‌టికెట్లు ఉన్న విద్యార్థులను బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందుగా విద్యార్థులను అనుమతించారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ చుండూరి వెంకటరత్నం నగరపాలకసంస్థ పాఠశాలలో నిర్వహించిన పరీక్షను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందు బాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం గదుల్లో ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ జిల్లాలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లా పరిశీలకుడు కృష్ణమోహన్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
తొలి రోజు ప్రశాంతం
పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ యు.వి.సుబ్బారావు తెలిపారు. ఆయన నగరంలోని సీవీఆర్ మునిసిపల్ స్కూల్, ఫిట్‌జీ, ఎస్‌కేఆర్‌ఎంఆర్ ఉన్నతపాఠశాల, నిర్మల హైస్కూల్, ఎస్‌వీబీవీఎన్ మునిసిపల్ హైస్కూల్, పటమట జెడ్పీ హైస్కూల్, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, డాన్‌బాస్కో తదితర పాఠశాలలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 63 పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment