తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చోరీలు
నందిగామ టౌన్: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు గ్రామాలలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్స్, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాలలో గాలించి పట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణాలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన నాగరాజుతో పాటు అతనికి అనుచరునిగా ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా నందిగామ, జగ్గయ్యపేట, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో తొమ్మిదిళ్లలో చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 300 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి వస్తువులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నందిగామ రూరల్ సీఐ చవాన్, చందర్లపాడు ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ జాలయ్యలను ఆయన అబినందించారు. సీఐ చవాన్, ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చోరీలు
Comments
Please login to add a commentAdd a comment