ఐటీడీఏ ఏర్పాటుకు తీర్మానం చేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ధర్నా చేసింది. ధర్నాలో పాల్గొన్న ఆదివాసీ సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయన్నారు. శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఐటీడీఏ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఏర్పడిందని, 16 మండలాల్లో ఆదివాసీలు సుమారు రెండు లక్షల మంది ఉన్నారన్నారు. వీటిలో ఐదు సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయన్నారు. కనీసం ఒక్క గ్రామం 5వ షెడ్యూల్లో లేకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలాస, పాతపట్నం బహిరంగ సభలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. ఈ ధర్నాకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, కె.కల్యాణ్ కృష్ణ, కె. పొలారి, జమ్మయ్య, భాస్కర్ రావు, పాపారావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా
Comments
Please login to add a commentAdd a comment