మహిళలపై వేధింపుల కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): మహిళలపై వేధింపుల కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్ పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్యవేదిక నేతలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. సినీ నటి కాదంబరి జత్వానిపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ న్యాయబద్ధంగా తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలంటున్నారని, ఆ రిపోర్టు రావడానికి ఎన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. నటి జత్వాని మాట్లాడుతూ.. తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేసి తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కోరారు. తన కేసును సీఐడీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని కేసును గాలికి వదిలేశారన్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని, వేలాది మంది మహిళలు గత ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment