అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా

Published Wed, Mar 19 2025 2:06 AM | Last Updated on Wed, Mar 19 2025 2:06 AM

అటవీ

అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయా లని సంబంధిత అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్హులకు ఇబ్బంది లేకుండా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) పట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన అటవీ శాఖ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా అవసరమన్నారు. ఏవైనా ఆక్రమణలను గుర్తిస్తే అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కూడిన జాయింట్‌ తనిఖీల బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాస్థాయిలో అటవీ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. పచ్చదనం పెంచేలా వినూత్న కార్యాచరణతో అడుగులు వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వివిధ నీటి వనరుల గట్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గట్లు కూడా బలంగా ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎఫ్‌ఓ జి.సతీష్‌, ఎఫ్‌ఆర్‌ఓ కె.శ్రీనివాసులురెడ్డి, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్‌ ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు అశోక్‌ లేల్యాండ్‌ ప్లాంట్‌ ప్రారంభం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అశోక్‌ లేల్యాండ్‌ బస్‌ బాడీ బిల్డింగ్‌ తయారీ పరిశ్రమను మంత్రి నారా లోకేష్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్‌ బాడీ బిల్డింగ్‌ తయారీ యూని ట్‌లో పెండింగ్‌ పనులను పూర్తి చేయటంతో పాటు ఇటీవలే ట్రయన్‌ రన్‌ నిర్వహించారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతికతతో ఈవీ, బీఎస్‌–6 నాణ్యాతా ప్రమాణాలతో బస్సులను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్‌ ఏటా 4800 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. మంత్రి లోకేష్‌ పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. అశోక్‌ లేల్యాండ్‌ మల్లవల్లి ప్లాంట్‌ హెడ్‌ శ్రీధరన్‌ను కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ ఆర్‌.వెంకట్రావు, బాపులపాడు తహసీల్దార్‌ బండ్రెడ్డి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

No comments yet. Be the first to comment!
Add a comment
అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా 1
1/1

అటవీ భూముల రక్షణకు పటిష్ట నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement