30 నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరాది, వసంత నవరాత్రుల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలలో అమ్మవారికి ప్రతి రోజు ఒక విశేషమైన పుష్పార్చన నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. అమ్మవారి స్నపనాభిషేకం నేపథ్యంలో తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, పల్లకీ సేవలను దేవస్థానం రద్దు చేసింది. అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది.
పంచాంగ శ్రవణం..
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథంపై నగర పురవీధుల్లో విహరిస్తారు.
ప్రత్యేక పుష్పార్చనలు..
వసంత నవరాత్రులలో భాగంగా 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయి. 30వ తేదీ ఉదయం 9.15 గంటలకు కలశస్థాపన, అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి మందిరం వద్ద జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే విశేష పుష్పార్చనలో రోజుకో ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
5 నుంచి శ్రీరామనవమి వేడుకలు
ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీరామనవమి వేడుకలను దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి 5వ తేదీ ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నాగవల్లీ దళార్చన (తమలపాకుల) జరుగుతుంది. ఘాట్‌రోడ్డులోని స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6వ తేదీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సీతారాముల కల్యాణం, 7వ తేదీ శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవాలు జరుగుతాయి.
ఏప్రిల్ ఏడో తేదీ వరకూ
ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment